వేగంగా విజయవాడకు..

3 Nov, 2014 00:56 IST|Sakshi
వేగంగా విజయవాడకు..

తాత్కాలిక రాజధానికి కార్యాలయాల తరలింపునకు చర్యలు
నాగార్జున వర్సిటీలో సచివాలయం, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖల ఏర్పాటుకు ప్రతిపాదనలు
గుంటూరు లాంఫాంలో వ్యవసాయ శాఖ కార్యాలయం!


సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ-గుంటూరు నడుమ రాజధాని నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్‌లు అజేయ్ కల్లం, శాంబాబ్, సాంబశివరావులతో కూడిన కమిటీ గుంటూరు, విజయవాడల్లో పర్యటించి తక్షణం కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను, ఉన్న సౌకర్యాలను పరిశీలించింది. నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు లాంఫాం, గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డు, కెనాల్ గెస్ట్‌హౌస్, మేథా టవర్, కానూరులోని నాలుగు అపార్టుమెంట్లను ఈ బృందం పరిశీలించింది.  

గొల్లపూడిలో మార్కెటింగ్ శాఖ, విజయవాడ కెనాల్ గెస్ట్‌హౌస్‌లో మరికొన్ని కీలక శాఖలు, మేధా టవర్‌లో ఐటీ విభాగం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. నాగార్జున వర్సిటీలో రాష్ట్ర సచివాలయం ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడికే రెవెన్యూ శాఖను కూడా తరలించాలన్న భావిస్తున్నారు.  ఇప్పటికే తాత్కాలిక రాజధానిలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్న మంత్రులకు అధికారుల కమిటీ పర్యటన ఊతమిచ్చినట్టయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులకు వారున్న చోటనే కార్యాలయాల ఏర్పాటుకు అవకాశమేర్పడింది. కృష్ణా జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి  ఉమామహేశ్వరరావు తొలుత విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇరిగేషన్ ఈఎన్‌సీ కార్యాలయాన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ కార్యాలయాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించడంలేదు.  గుంటూరు లాంఫాంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు మంత్రి ప్రతిపాటి పుల్లారావు యోచిస్తున్నారు. నాగార్జున వర్సిటీలో సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటుకు మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రతిపాదించినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు