ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది : రైతులు

30 Jul, 2013 05:28 IST|Sakshi
సాక్షి, మచిలీపట్నం :   గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో చేనేత కార్మికుడు మెట్ల రామారావు అప్పుల బాధతో ఈ నెల 15న ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు. ఇంజినీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు, మతిస్థిమితంలేని మరో కొడుకు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
 
  చందర్లపాడు మండలం పున్నవల్లికి చెందిన ఐదెకరాల కౌలు రైతు పోరుదండి ఏడుకొండలు ఈ నెల 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది సాగుకు చేసిన అప్పులు తడిసిమోపెడవడం ఈ ఏడాది సాగుకు పెట్టుబడి కూడా దొరికే పరిస్థితి లేక కలత చెందిన రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణంతో భార్య, ముగ్గురు పిల్లలు, వృద్ధురాలైన తల్లి దిక్కులేని వారయ్యారు. 
 
 పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వ అలక్ష్యం వల్ల అప్పుల బాధతో ఇలా నిండు జీవితాన్ని సగంలోనే చాలిస్తున్నవారు జిల్లాలో ఎందరో ఉన్నారు. ఈ పరిణామాలకు దారితీస్తున్న కారణాలు తెలుసుకోవాలంటే ఒకమారు చేనేత, వ్యవసాయ రంగాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తీరును పరికించాల్సిందే.
 
 జిల్లాలో పదివేలకు పైగా కుటుంబాలకు చేనేత వృత్తే జీవనాధారం. పెడన, గూడూరు మండలాల్లో ఆకులమన్నాడు, కప్పలదొడ్డి, పోలవరం, రాయవరం, ఐదుగుళ్లపల్లి గ్రామాలతోపాటు జిల్లాలోని చింతగుంటపల్లి, చల్లపల్లి, కాజ, ఘంటసాల, గుడ్లవల్లేరు, వింజరంలో ఎక్కువగా చేనేత కార్మికులున్నారు. సుమారు ఆరు వేల మందికి గుర్తింపు కార్డులున్నాయి. మిగిలినవారు ఇంకా గుర్తింపు కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. చే నేతలో మజూరీ తక్కువగా ఉండటంతో పలువురు ఇతర వృత్తులకు మారిపోతున్నారు. చేనేత పొట్టనింపకపోవడంతో పెడనలోని చేనేత కార్మికులు కలంకారీ కార్మికులుగా మారి షెడ్డుల్లో చేరి జీవనభృతి కొనసాగిస్తున్నారు.
 
 చేనేత కార్మికులకు అందని పథకాలు చేనేత కార్మికులకు ఆర్టీజన్ కార్డులపై రుణం అందటం లేదు. ఆర్టీజన్ కార్డులున్నవారికి రూ.25 వేల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పావలా వడ్డీతో చేనేత  కార్మికులు తిరిగి నెలనెలా వాటిని చెల్లించాలి. జిల్లాలో రెండువేల మందికి రుణాలు ఇవ్వాలని గుర్తించారు. కానీ 300 మందికి మాత్రమే ఈ రుణాలందాయి. ఆరు వేల మందికి చేనేత గుర్తింపు కార్డులుంటే ఇప్పటివరకు రెండువేల మందికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వలేదు. కొత్తవారికి మంజూరు చేయాలని పదేపదే ప్రాధేయపడినా కనికరం చూపటం లేదు. ఈ పథకంతో ఏడాదికి రూ.15 వేల వరకు చేనేత కార్మికుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రిలో ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చు. చేనేత సహకార సంఘాల్లో ఉన్న కార్మికులకే చేనేత జౌళిశాఖ నుంచి వచ్చే సబ్సిడీలు అందుతున్నాయి. సహకారేతర కార్మికులకు సబ్సిడీలు అందటం లేదు. రుణాలివ్వక, సబ్సిడీలు వర్తించక చేనేత కార్మికులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలై అధిక వడ్డీల బారిన పడుతున్నారు. వాటిని తీర్చలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
 అన్నదాతకు తప్పని పస్తులు..
 
 మట్టిని నమ్ముకుని స్వేదం చిందించి ఆహార ధాన్యాలు పండించే అన్నదాతకు కనీసం పట్టెడన్నం దొరకని దయనీయ స్థితి జిల్లాలో నెలకొంది. జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాల్లో పలు రకాల పంటల సాగు జరుగుతోంది. వాటిలో దాదాపు 6.34 లక్షల ఎకరాల్లో వరి, 1.50 లక్షల ఎకరాల్లో పత్తి, 45 వేల ఎకరాల్లో చెరుకు, సుమారు 80 వేల ఎకరాల్లో ఉద్యాన వన పంటలు సాగుచేస్తున్నారు. జిల్లాలో సుమారు 1.40 లక్షల మంది రైతులుండగా, మరో 1.60 లక్షల మంది కౌలు రైతులు నేల తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ తీరు కర్షకుల పాలిట శాపంగా మారింది. ఇటీవల సాగునీరు కూడా అందించలేని దుస్థితి దాపురించింది. సాగునీరివ్వని సర్కారు డెల్టా ఆధునికీకరణ అంటూ కాలయాపన చేసి తీరా వాటిని కూడా సక్రమంగా పూర్తిచేయని పరిస్థితి నెలకొంది. కాలువలకు నీటి విడుదల తీవ్ర జాప్యం కావడం వల్ల సాగు జాప్యమై పంటలను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు ఇటీవల కరెంటు కోతలతో బోరు నీటిపై సాగు చేసిన రైతులు నీళ్ల బోరుకు కరెంటు సరఫరా సరిగ్గాలేక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. 
 
 2011లో థానే తుపాను ధాటికి 90,956 మంది, 2012లో నీలం తుపాను ప్రభావానికి 33,019 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన అకాల వర్షాలకు దాదాపు ఏడు వేల మందికి పైగా రైతులు క‘న్నీటి’ పాలయ్యారు. ఈ మూడు వైపరీత్యాల్లోనూ నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సిడీ సుమారు రూ.40 కోట్లు ఇంతవరకు విడుదల చేయలేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అన్నింటా దగా చేయడంతో అప్పులపాలైన అన్నదాతలు చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 
 
మరిన్ని వార్తలు