నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి

7 Nov, 2015 01:42 IST|Sakshi

నగరంపాలెం(గుంటూరు) : జిల్లాలో శనివారం నుంచి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను కచ్చితంగా అమలుచేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజరత్నం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రహదారి భద్రత, హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్ వినియోగం తక్షణమే అమల్లోకి తీసుకొని రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారన్నారు. నవంబరు మొదటి తేదీ నుంచే హెల్మెట్‌లు తప్పనిసరి అని నిర్ణయం తీసుకోవటంతో గత మూడు నెలలుగా జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.

ద్విచక్రవాహనదారుల భద్రత దృష్ట్యా హెల్మెట్ నిబంధన తక్షణమే అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.  శనివారం నుంచి హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదుచేసి జరిమానాతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నివారణకు రవాణా శాఖకు సహకరించాలని డీటీసీ రాజరత్నం కోరారు.
 

మరిన్ని వార్తలు