‘పవన విద్యుత్.. ఆ ఇంటికి సొంతం’

9 Aug, 2015 02:01 IST|Sakshi
‘పవన విద్యుత్.. ఆ ఇంటికి సొంతం’

గుడ్లవల్లేరు : ఒక సాధారణ వెల్డరైన గుడ్లవల్లేరులోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన జె.వేణునాయక్ తనకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో పవన విద్యుత్ పరికరాన్ని ఇంట్లో ఏర్పాటుచేసుకున్నాడు. దీంతో ఉత్పత్తవుతున్న విద్యుత్‌తో ఇంట్లోని టీవీ, రెండు ఫ్యాన్లు, నాలుగు లైట్లు నిరంతరంగా పనిచేస్తుండటం గమనార్హం. వివరాలు ఆయన మాటల్లోనే...‘నాలుగు నెలల కిందట స్టీల్‌తో పెద్ద రెక్కల ఫ్యాన్‌ను తయారు చేసి మా ఇంటిముందు పిల్లర్‌కు అమర్చాం.

అది గాలివాటాన్ని బట్టి తిరిగే విధంగా, ఈదురుగాలులకు సైతం తట్టుకునేలా రూపొందించాం. గాలికి తిరిగిన ఫ్యాన్ ద్వారా డీసీ డైనమోతో ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ చార్జ్ అవుతుంది. 24 గంటలూ టీవీతో పాటు రెండు ఫ్యాన్లు, నాలుగు లైట్లు వాడుకుంటున్నాం. పరిమితంగా అమర్చుకున్న ఈ విద్యుత్ పరికరాల వలన ఫ్రిజ్, మోటరు మాత్రం పనిచేయవు. ఇంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాడుకునేందుకు ట్రాన్స్‌కో కరెంట్ మీటర్ కూడా ఉంచాం.

 పవన విద్యుత్‌ను ఉపయోగిస్తే నామమాత్రంగా నెలకు రూ.150లే కరెంట్ బిల్లు వస్తోంది. సొంత విద్యుత్ తయారీ లేకముందు రూ. 450 నుంచి రూ. 500 బిల్లు వచ్చేది..’

మరిన్ని వార్తలు