పశువులకూ హాస్టల్

19 Jan, 2016 23:52 IST|Sakshi
పశువులకూ హాస్టల్

రాష్ట్రంలోనే తొలిసారిగా కొయ్యూరు మండలంలో ఏర్పాటుకు ప్రతిపాదన
రూ.2 కోట్లు ఖర్చవుతుందని అంచనా
ఎకరా స్థలంలో షెడ్ల నిర్మాణం.. 200 గేదెలకు అవకాశం
13 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం

 
రాష్ట్రంలోనే మొదటిసారిగా పశువుల హాస్టల్‌ను కొయ్యూరు మండలంలో  ఏర్పాటుచేసేందుకు మంగళవారం ప్రతిపాదనలు తయారు చేశారు. దీనికి రూ.రెండు కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పాల ఉత్పత్తిని పెంచి గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నడింపాలెం పంచాయతీ నల్లగొండలో దీన్ని ఎకరా స్థలంలో ఏర్పాటు చేస్తారు. 200 గేదెలను ఇక్కడ ఉంచుతారు. 13 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు రైతులు  అంగీకరించారు. ఐటీడీఏ పీవో నుంచి ఈ ప్రతిపాదన కలెక్టర్‌కు వెళ్తే అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వానికి  చేరుతుంది.
 
కొయ్యూరు: పశువుల పెంపకంలో సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా  పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొయ్యూరు వెటనరీ వైద్యుడు కె.రాజేశ్‌కుమార్ మంగళవారం పశువుల హాస్టల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను పాడేరు ఏడీ కిషోర్‌కు అందజేశారు. ఆయన వాటిని ఐటీడీఏ పీవో హరినారాయణన్‌కు అందజేస్తారు. దానిని పరిశీలించిన అనంతరం పీవో కలెక్టర్‌కు ప్రతిపాదన పంపిస్తారు. అది ప్రభుత్వానికి చేరిన తరువాత నిధులు విడుదలవుతాయి. గత నెలలో పశుసంవర్థక శాఖ జేడీ నల్లగొండను సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి ఇక్కడే పశువుల హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రతిపాదన తయారుచేశారు. కంపరేగుల, నల్లగొండ, పెదమాకవరం, వెలగలపాలెం పంచాయతీ శీకాయపాలేనికి చెందిన 70 మంది రైతుల  గేదెలను ఇక్కడ ఉంచుతారు. ఉపాధి హామీ నుంచి పశువులకు గ్రాసం నిమిత్తం భూమిని సేకరిస్తారు. దీనికి అవసరమైన   సాగునీటిని  ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు కల్పిస్తారు. అక్కడ రైతులు పశుగ్రాసానికి 13 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించారు.  పాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని  భూమి  ఇచ్చిన రైతులకు  చెల్లిస్తారు. ఇందుకు రివాల్వింగ్ నిధిని ఏర్పాటు చేస్తారు. ప్రతి లీటరు పాలకు వచ్చే ఆదాయంలో కొంత ఈ నిధికి జమచేసి  పశుగ్రాసానికు చెల్లిస్తారు.

వెయ్యి లీటర్ల వరకు పాల సేకరణ
200 గేదెలను హాస్టల్లో ఉంచితే సుమారు వెయ్యి లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. దీని ద్వారా రైతులు నెలకు రెండు గేదెలు ఉంటే రూ.16 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎక్కువమంది రైతులు పాలను విక్రయిండం ద్వారా నెలకు ఒక గేదె నుంచి రూ. 8 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.  పశువుల హాస్టల్ ఏర్పాటు తరువాత ఎవరు  ఎక్కువ చెల్లిస్తే వారికే పాలు విక్రయించాలని రైతులు నిర్ణయించారు. పశువులను శుభ్రమైన వాతావరణంలో ఉంచి వాటికి నీరు, గ్రాసం కొరత లేకుండా చూడటం హాస్టల్ ఏర్పాటు ద్వారా సాధ్యపడుతుందని అధికారులు భావిస్తున్నారు.  పాల ఉత్పత్తితో పాటు  గిరిజనుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిపై  కొయ్యూరు పశువైద్యుడు కె.రాజేశ్‌కుమార్‌ను సంప్రదించగా హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపామని చెప్పారు. దీనికి రూ.రెండు కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. రైతుల ఆధార్ కార్డులతో  పాటు పూర్తి వివరాలను అందజేశామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు