ఇసుక మాఫియాపై రగిలిన సభ

24 Dec, 2014 02:09 IST|Sakshi
ఇసుక మాఫియాపై రగిలిన సభ

శాసన సభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి మృణాళిని సమాధానంపై విపక్షం అసంతృప్తి
 
హైదరాబాద్: ఏపీలో ఇసుక మాఫియాపై మంగళవారం శాసన సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఇసుక మాఫియాకు పరోక్షంగా అధికారపక్షం సహకరిస్తోందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాజన్న దొర, చిర్ల జగ్గిరెడ్డి, జి.శ్రీకాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మృణాళిని సమాధానమిచ్చారు. మంత్రి సమాధానంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజేంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ ఇసుక లభ్యత, విక్రయాల్లో ప్రభుత్వ విధానంలో స్పష్టత లేదని చెప్పారు. మాఫియాను ఎదుర్కొనేందుకు డ్వాక్రా గ్రూపుల శక్తి సామర్థ్యాలు సరిపోవేమోనన్న సందేహాన్ని వ్యక్తంచేశారు. ఇందుకోసం ఓ యంత్రాంగం ఉండాలన్నారు. ఇసు కధరల నిర్ధారణకు అనుసరిస్తున్న ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించా రు. ఇసుక రీచ్‌లను పేరుకే డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయని, వాస్తవానికి అధికార పార్టీ వాళ్లే వీటిని నడిపిస్తున్నారని చెప్పారు. రాజమండ్రి ప్రాంతంలో ఇసుక తవ్వకాలపై ఇద్దరు అధికార పక్ష ఎమ్మెల్యేల మధ్య ఘర్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

ఇందుకు మంత్రి మృణాళిని తీవ్ర అభ్యంతరం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ చర్చకు అనుమతించవద్దని స్పీకర్‌ను కోరారు. అందరికీ ఆపాదించేలా వ్యాఖ్యలు చేయవద్దని స్పీకర్ సూచించారు. రాజేంద్రనాధ్‌రెడ్డి సోమవారం సభలో చేసినట్టుగా భావిస్తున్న ఓ వ్యాఖ్యను స్పీకర్ ఉదహరించారు. దీనికి రాజేంద్రనాధ్ అభ్యంతరం చెప్పారు. తనకా ఉద్దేశం లేదని, తాను మాట్లాడిన దానికి కొందరు లేనిపోనివి ఆపాదించడంవల్లే ఆ అపోహ కలిగిందని అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం మంత్రి మృణాళిని సమాధానమిస్తూ అంతా సక్రమంగానే ఉందని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే మరో 200 ఇసుక క్వారీలను గుర్తించి వేలం వేస్తామన్నారు. ఏ జిల్లాల్లో ఎన్ని సంఘాలకు క్వారీలను అప్పగించింది, ఎంతెంత తవ్విందీ, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని లిఖితపూర్వకంగా సభ ముందుంచారు.
 

మరిన్ని వార్తలు