గ్యాస్ సిలిండర్లు పేలి భారీ విస్ఫోటనం

20 Aug, 2015 02:18 IST|Sakshi
గ్యాస్ సిలిండర్లు పేలి భారీ విస్ఫోటనం

♦ మహిళ సజీవదహనం
♦ రెండు పూరిళ్లు, గడ్డివామి దగ్ధం
♦ 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు ఆహుతి
 
 పోలిపాడు (ఓజిలి) : ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో రెండు గ్యాస్‌సిలిండర్లు పేలి భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా, రెండు పూరిళ్లల్లో 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.70 వేలు నగదు, బట్టలు, ఇతర సామగ్రి మంటల్లో ఆహుతయ్యాయి. రెండు పూరిల్లు, గడ్డివామి దగ్ధమయ్యాయి. ఈ విషాద ఘటన మండలంలోని భువనగిరిపాళెం పంచాయతీ పోలిపాడులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు..  గ్రామానికి చెందిన పుచ్చకాయల నాగభూషణమ్మ (51), కోడలు నారాయణమ్మ ఇంటిలో చిన్నపాపతో ఆడుకుంటున్నారు.

ఈ క్రమంలో పాప ఆకలికి ఏడ్చింది. దీంతో  మనమరాలికి పాలు కాసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించగా, ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి దట్టమైన మంటలు వ్యాపించాయి. ఇంటిలోనే ఉన్న మరో పుల్ సిలిండర్ కూడా మంటల ధాటికి పేలిపోవడంతో భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో పూరిల్లు తాటి దబ్బలు నాగభూషణమ్మపై పడటంతో మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. హఠాత్ పరిణామంతో కోడలు నారాయణమ్మ చిన్నపాపను తీసుకుని ఇంటి బయటకు పరుగెత్తింది.

గ్యాస్ సిలిండర్లు పేలి  పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె కుమారుడు నారాయణ, చుట్టు పక్కల వాళ్లు బిందెలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో పూరిల్లు, ఒక గడ్డివామి ఆగ్నికి ఆహుతయ్యాయి. అప్పటి వరకు తమతోనే ఉన్న నాగభూషణమ్మను అంతలోనే మృత్యువు కబళించడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఎస్సై సాంబశివరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగభూషణమ్మ మృతదేహం పూర్తిగా మంటల్లో కాలిబూడిదైపోయింది.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు