అనుమతి ఉన్న హేచరీల్లోనూ నాసిరకం సీడ్

20 Dec, 2014 01:18 IST|Sakshi

కావలి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీల్లో చాలా వరకు నాణ్యమైన సీడ్ లభించడం లేదు. హేచరీలు సంబంధిత టెక్నీషియన్లను నియమించకోకుండా నాసిరకం సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం తోటల్లో ఉన్న పశువుల పాకల్లో సైతం రొయ్యల పిల్లల హేచరీలు పెడుతున్నారని సీఫుడ్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డీబీ రవిరెడ్డి అన్నారు.
 
 శుక్రవారం స్థానిక జేబీ డిగ్రీ కళాశాలలో తీర ప్రాంతంలోని ‘రొయ్యలు, చేపల సాగులో వినియోగించే రసాయనాలు, వ్యాధి నిరోధకాలు, వాటి ప్రభావం’ అనే అంశంపై నాక్ సహకారంతో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తం గా 180 హేచరీలకు గుర్తింపు ఉందన్నారు. ఇందులో 50 హేచరీలే నాణ్యమైన సీడ్  అమ్మకాలు సాగిస్తున్నాయన్నారు. సీఫుడ్స్ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి రూ.11 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం అందుతుందన్నారు.
 
 రొయ్యల సాగుపై అవగాహన లేకపోవడంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారన్నారు. అవగాహన లేకుండా ఇష్టానుసారం యాంటీబయాటిక్స్‌ను వాడడం, మేతను వేయడం రైతుల నష్టాలకు కారణమని వివరించారు. రాష్ట్రంలో మత్స్యశాఖ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, రొయ్యల సాగుపై రైతులకు ఆ శాఖ అధికారులు అవగాహన కల్పించకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగం ఎంపెడా నుంచి మాత్రమే కాస్త సహకారం ఉందన్నారు. మత్స్యశాఖలో  సిబ్బంది కొరతతో అనధికార హేచరీలు, నాణ్యతను పాటించని హేచరీలపై చర్యలు తీసుకోలేక పోతున్నారన్నారు.
 
  హేచరీల నిర్వాహకులు సేకరించిన తల్లి రొయ్యలు పదిసార్లు మాత్రమే నాణ్యమైన రొయ్య పిల్లలను అందిస్తాయన్నారు. ఆ తరువాత అవి నాసిరకమైన సీడ్ ను ఉత్పత్తి చేస్తాయన్నారు. అమెరికా, యూరోపియన్ దేశాలు, జపాన్‌ల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలు రొయ్యలను తిరస్కరిస్తున్నాయన్నా రు. ఏ దేశం నుంచి అయినా యాంటీబయాటిక్స్ ఆవశేషాలు ఉన్న రొయ్యలను క్రమే ణా వస్తుంటే ఆ దేశం నుంచి ఉత్పత్తులను నిషేధిస్తాయన్నారు. నిషేధం విధిస్తే రొయ్యల వ్యాపారంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. బ్లాక్ టైగర్ రొయ్యల్లో అలాంటి అవశేషాలు ఉన్నాయని తిరస్కరించడంతో పశ్చిమబెంగాల్‌లోని రైతులు తీరని నష్టాన్ని పొందాల్సి వచ్చిందన్నారు.
 
 వైరస్ వ్యాధి వ్యాపిస్తే నియంత్రించడం సాధ్యం కాదు : ప్రొఫెసర్ హరిబాబు
 రొయ్యలకు వైరస్ వ్యాధి వస్తే నియంత్రించడం సాధ్యం కాదని ముత్తుకూరు మత్స్యకళాశాల ప్రొఫెసర్ పీ హరిబాబు అన్నారు. రొయ్యలకు 22 రకాల వైరస్‌ల వల్ల వ్యాధులు వస్తాయని, వాటికి మందులు లేవన్నారు. వైరస్ వ్యాధులకు మందులు ఉన్నాయని కొందరు వ్యాపారులు, కంపెనీలు చెబుతూ రొయ్య రైతులను మోసం చేస్తున్నాయన్నారు. మన దేశంలో 4 రకాల రొయ్యల వ్యాధులు మాత్రమే ఇప్పటి వరకు బయట పడ్డాయన్నారు. రొయ్యల సాగులో నష్టం వస్తే 60 శాతం వైరస్ వల్ల, 20 శాతం బాక్టీరియా వల్ల, 20 శాతం రైతులు అవగాహనా లోపంతో వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఎక్కడా రొయ్యలకు వచ్చే వ్యాధులను పరీక్ష చేసేందుకు ల్యాబ్‌లు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లేదన్నారు. బాహ్యంగా పెరిగే జీవుల్లో అనారోగ్యాన్ని గుర్తించ వచ్చునని, నీటిలో పెరిగే జీవుల్లో కనుక్కొవడం కష్టమన్నారు.
 
 రొయ్యలు తమ శరీరంపై ఉండే మాలిన్యాన్ని తమంతట తామే శుభ్రం చేసుకుంటాయని, వాటికి ఆ శక్తి ఉందన్నారు. ఏదైనా రొయ్య శుభ్రంగా లేక మట్టి పేరుకుపోయి గుంతలో కనపడితే అవి వ్యాధికి గురవుతాయని, అలాంటి వాటిని గుర్తించి వెంటే పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపాలన్నారు. రొయ్యల వ్యాధుల పరీక్ష కేంద్రాలు ప్రస్తుతం చెన్నైలో మాత్రమే ఉన్నాయన్నారు. రొయ్యలు సైన్స్ పరిజ్ఞానంలో ఇన్ వర్టిబ్రెట్స్ అని, వాటికి వ్యాధి నిరోధక శక్తి ఉండదన్నారు. అందు వల్ల వైరస్ వ్యాధి వ్యాపిస్తే దాన్ని నియంత్రించడం సాధ్యంకాదన్నారు.
 
 ఎవరైనా మందులు కంపెనీల నిర్వాహకులు వైరస్‌ను నియంత్రించేందుకు మందులు ఉన్నాయంటే నమ్మరాదన్నారు. 20 శాతం బాక్టీరియా సోకిన రొయ్యలను మందులు వాడడం ద్వారా వ్యాధిని నివారించవచ్చన్నారు. రొయ్యల సాగులో ఎక్కువగా ఫీడ్ వేయడం, యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదన్నారు. రైతులకు రొయ్యల సాగుపై పరిజ్ఞానం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. నాణ్యమైన రొయ్యల సీడ్‌ను గుర్తింపు ఉన్న నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న హేచరీల నుంచి మాత్రమే రైతులు సీడ్ కొనుగోలు చేయాలన్నారు. గతంలో వ్యాధుల బారిన పడి టైగర్ రొయ్యల పెంపకం కనమరుగైందన్నారు.
 
 ఇప్పుడు  వెనామీ రొయ్యల సాగులో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఆయన కోరారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, తర్వాత సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రొజెక్టర్‌తో రొయ్యల సాగుపై అవగాహన కల్పించారు. విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి, జేబీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డి, సదస్సు చైర్మన్, జేబీ ప్రిన్సిపల్ మేజర్ పాల్‌మనోహర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ ఎం.వీ.భాస్కర్, వివిధ యూనివర్సిల నుంచి అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, రైతులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు