పునర్నిర్మాణంలో ఉద్యోగులదే కీలకపాత్ర

4 Mar, 2014 00:05 IST|Sakshi

 సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: మలివిడత తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను పునర్నిర్మాణసమయంలో పోషిస్తామని, భవిష్యత్తులో ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుందని టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఇంటిగ్రెటెడ్ హాస్టల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం ఏదైనా ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం టీఎన్‌జీవో నేతృత్వంలో ఉద్యోగులు పోరాటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె, సాగరహారం, మిలీనియం మార్చ్, ఢిల్లీ సంసద్ యాత్రలో టీఎన్‌జీవో పాత్ర ముఖ్యంగా ఉందన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ కోసం ఈ ప్రాంత ఉద్యోగులుగా ఉద్యమించామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడి ఉద్యోగులు అక్కడే, ఎక్కడి పింఛన్లు అక్కడే అనే వాదన వినిపించడాన్ని టీఎన్‌జీవో తీవ్రంగా ఖండిస్తోందన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల విద్యాభ్యాసం, అపాయింట్‌మెంట్‌ను ప్రమాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ డిప్యూటేషన్ల పేరిట సీమాంధ్రకు చెందిన 1.22 లక్షల మంది ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నట్లు అధికార రికార్డులు చెబుతున్నాయన్నారు.

68 వేల మంది ఉద్యోగుల అక్రమ డిప్యూటేషన్లపై ప్రభుత్వం సర్వీస్ బుక్కులు లేవని కుంటి సాకులు చెప్పడం విచారకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో 42 రోజుల పాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగులకు సమ్మెకాలపు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పదో పీఆర్‌సీలో 69 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన ఆరోగ్య బీమా కార్డులను ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్యాంరావ్, విక్రమ్, జెల్ల సుధాకర్, సిద్దిపేట తాలూకా అధ్యక్షులు శ్రీహరి, అశ్వాక్, శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్‌వర్మ, రామారావు, విక్రమ్‌రెడ్డి తదితతరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు