గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం

21 Aug, 2014 01:38 IST|Sakshi

 కర్నూలు(జిల్లా పరిషత్): గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకమని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని సర్పంచ్‌లకు బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో గ్రామ పరిపాలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో అనేక పథకాలను అమలు చేస్తోందని, వీటి పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌లపైనా ఉందన్నారు.

అయితే చాలా మంది వారి గ్రామాల పరిధిలోని సమస్యలను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సర్పంచ్‌లు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో రాజకీయ, సామాజిక ఆటంకాలు ఎన్ని ఉన్నా సర్పంచ్‌ల ప్రధాన అజెండా అభివృద్ధే కావాలని సూచించారు. ఈ విషయంలో ఫిర్యాదులుంటే ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ప్రజావాణి వెబ్‌సైట్ ద్వారా తెలియజేవచ్చన్నారు. త్వరలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రూ.2లకే 20 లీటర్ల నీటిని ప్రతి కుటుంబానికి అందజేసేందుకు దశల వారీ కార్యక్రమం రూపొందిస్తున్నట్లు చెప్పారు.

జిల్లాలోని 360 జిల్లా పరిషత్ పాఠశాలల్లో టాయ్‌లెట్లను కార్పొరేట్ సంస్థల సహాయంతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, సాగులో లేని భూముల్లో నీటి కుంటలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో జయరామిరెడ్డి, డీపీవో శోభా స్వరూపరాణి, డీఎల్‌పీవో విజయకుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ వై.నరసింహులు, డీఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు