పోర్టుపై కీలక నిర్ణయం

15 Jun, 2014 03:03 IST|Sakshi
  • బెల్టుషాపుల నియంత్రణ
  •   త్వరలో ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లింపు
  •   మంత్రి కొల్లు రవీంద్ర
  • కోనేరుసెంటరు (మచిలీపట్నం) : ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేబినెట్‌లో తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి పాటుపడతానని ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.  ఆయన కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ  బందరు పోర్టు విషయంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళానని చెప్పారు.

    గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీ విధానాల వల్ల అవినీతిలో కూరుకుపోయిందని, దానిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.   బెల్టుషాపుల నిర్వాహకులు వాటిని మూసివేసి ప్రత్యామ్నాయ వ్యాపారాలు చేసుకోవాలని  మంత్రి కోరారు. బెల్టుషాపులకు మధ్యం సరఫరా చేసే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    మద్యంషాపుల యజమానులు ఎమ్మార్పీ ధరకు విక్రయించకపోయినా, సమయపాలన లేకుండా విక్రయాలు జరుపుతున్నా ఫిర్యాదు చేసేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ఫ్రీ నంబరు  ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.   మచిలీపట్నంలోని డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రూ. 23 కోట్లు నిధులు తీసుకువచ్చి డ్రెయిన్ల లింకును కలుపుతారని చెప్పారు.  

    రహదారులు ముంపునకు గురికాకుండా పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. మరో ఆరు నెలల్లో నియోజకవర్గ పరిధిలో తాగునీరు పుష్కలంగా అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. బీసీ సంక్షేమశాఖకు సంబంధించి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లకు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద గత ప్రభుత్వం రూ. 1500 కోట్లు చెల్లించకుండా తాత్సారం చేసిందన్నారు. త్వరలో ఈ మొత్తాన్ని చెల్లిస్తామని, కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకూడదని ఆయన కోరారు.  చేనేత కార్మికులు తయారు చేసిన నిల్వలు చాలా ఉన్నాయని త్వరలో ఆప్కో సంస్థతో చర్చించి విక్రయానికి చర్యలు చేపడతామన్నారు.
     
    ఆలయాల్లో మంత్రి పూజలు...
     
    ఈడేపల్లి (మచిలీపట్నం) : మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులతో కలసి  పలు ఆలయాల్లో విశేష పూజలు చేశారు.  చినకరగ్రహారం ఫరీద్‌బాబా దర్గాలో పూజలు చేశారు.    బచ్చుపేట శ్రీవెంకటేశ్వరస్వామి  ఆలయంలో శ్రీవారి జన్మనక్షత్రం  సందర్భంగా దేవాలయంలో  ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రవీంద్ర ప్రారంభించారు.

    ఆయనతోపాటు భార్య నీలిమ, కుమారుడు పునీత్‌చంద్ర పూజల్లో పాల్గొన్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ మారుతీదివాకర్,  తహశీల్దార్ నారదముని, ఆర్‌ఐ శంకర్,   మోటమర్రిబాబాప్రసాద్, వార్డు కౌన్సిలర్లు   ఆంజనేయప్రసాద్, లోగిశెట్టి వెంకటేశ్వరరావు, అంకా వెంకట్రావ్, కాశీవిశ్వనాధం, గొర్రెపాటి గోపీచంద్, నారగాని ఆంజనేయప్రసాద్, మరకాని పరబ్రహ్మం, కాసాని భాగ్యారావు, వక్కపట్ల శ్రీనివాసరావు తదితరులున్నారు.
     

మరిన్ని వార్తలు