-

మురికివాడ ప్రజలంటే... అంత చులకనా!

22 Feb, 2016 01:19 IST|Sakshi

సీఎం వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
పేదల ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుందని కలవరం
విపక్షాల మండిపాటు  బాధ్యత మరిచి.. వ్యాఖ్యలు చేయటంపై ఆగ్రహం

 
విజయవాడ : ‘మంచి వాతారణంలో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి.. మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం నగరంలో జరగుతున్న పరిణామాలకు తోడు చంద్రబాబు నాయుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల తాము ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. మురికివాడల్లో ప్రజలంటే చంద్రబాబుకు అంత చులకనా అనే భావన పేద ప్రజల్లో వ్యక్తమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
 
ఎన్నికల్లో ఒకలా.. ఆ తర్వాత మరోలా..
ఎన్నికల సందర్భంగా పేదల   జీవితాలను మార్చేస్తానని, వారి అభ్యుదయానికి కృషిచేస్తానని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పేదలను ఆదుకోకపోగా, వారికి వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, రామవరప్పాడులో ఇళ్ల తొలగింపే దీనికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 150 పేదల ఇళ్లు తొలగించగా, మరో 500 ఇళ్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మరోపక్క కాల్వల బ్యూటిఫికేషన్ పేరుతో గతంలో కాల్వగట్లను తొలగించాలని కూడా ప్రభుత్వం యోచించింది. దీంతో ఎప్పుడైనా తమ ఇళ్లు పీకేస్తారేమోనని పేదలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాక, వారికి సర్దిచెప్పలేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో మరింత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
నగరంలో 200కు పైగా మురికివాడలు...
 గతంలో నగరంలో సుమారు 200కు పైగా మురికివాడలు ఉన్నాయి. అందులో సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని అంచనా. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ పేదల ఓట్లతోనే తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 15 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుపొందారు. ఇప్పుడు అదే పేద ప్రజల్ని చులకన చేసి మాట్లాడుతూ కార్పొరేట్లకు చంద్రబాబు కొమ్ముకాయడంపై విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు రాష్ట్రంలోనూ, ఇటు నగరపాలక సంస్థలోనూ అధికారంలో ఉన్న టీడీపీ మురికివాడల్ని అభివృద్ధి చేయకుండా వారిని విమర్శించడంపై తప్పుపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ మురికివాడల్లో ప్రజల్ని చిన్నచూపు చూస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు.
 
మురికివాడల్ని అభివృద్ధి చేయకపోవడం ప్రభుత్వం తప్పు
 ఉన్నతమైన వర్గాల్లోనివారే ఉన్నతమైన ఆలోచనలు చేస్తారని, మురికివాడల్లో ఉన్నవారు మురికి ఆలోచనలు చేస్తారనుకోవడం చాలా తప్పు. మురికివాడల్ని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం తన బాధ్యత విస్మరించి అక్కడివారిని చులకనగా మాట్లాడటం బాధాకరం. పేదల ఓట్లతో గెలిచి, గద్దెనెక్కిన చంద్రబాబు మాటల్లోనూ చేతల్లోనూ కార్పొరేట్లను పొగుడుతూ, పేదల్ని విమర్శించడం తగదు. ఈ విధంగా చేస్తే పేద ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారు.
 - సిహెచ్.బాబూరావు, సీపీఐ రాజధాని ప్రాంత కన్వీనర్
 
బాబు మానసికస్థితిపై అనుమానం వస్తోంది
ఎస్సీలుగా పుట్టాలని ఎవరి కోరుకుంటారు.. మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయి.. అంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయన మానసికస్థితిపై అనుమానం వస్తోంది. మురికివాడల నుంచే ఐఏఎస్ అధికారులు, గొప్ప రాజకీయ నేతలు వచ్చారు. మురికివాడలను బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాగా, దానిని పక్కన పెట్టి అక్కడి ప్రజల్ని అవహేళన చేయడం సరికాదు. దేశంలో 40 శాతం ప్రజలు పేదరికంలోనే ఉన్నారు. వారి మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోము.
 - కొలనుకొండ శివాజీ, పీసీసీ అధికార ప్రతినిధి
 

మరిన్ని వార్తలు