లారీ డ్రైవర్ సజీవ దహనం

12 Oct, 2014 00:32 IST|Sakshi
లారీ డ్రైవర్ సజీవ దహనం
  • చెట్టును లారీ ఢీకొనడంతో ప్రమాదం
  • పెడిమికొండ అటవీ ప్రాంతంలో దుర్ఘటన
  • నాతవరం : చెట్టును లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మండలంలోని గాంధీనగరం సమీపం పెడిమికొండ అటవీ ప్రాంతంలో నర్సీపట్నం నుంచి ఎర్రమట్టి లోడుతో తుని వైపు వెళ్తున్న లారీ రోడ్డు పక్కనున్న చెట్టును అదుపు తప్పి ఢీకొంది. శనివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు రావడంతో నర్సీపట్నానికి చెందిన పెదిరెడ్ల కన్నాపాత్రుడు (45)  సజీవ దహనమయ్యాడు. లారీ యజమాని అయిన కన్నాపాత్రుడే వాహనాన్ని నడుపుతున్నాడు.

    ఆ సమయంలో లారీలో అతనుతప్ప మరెవరూ లేరు. చింతపల్లి మండలం డౌనూరు నుంచి శుక్రవారం సాయంత్రం మట్టి లోడు వేసుకొని రాత్రికి నర్సీపట్నంలో తన ఇంటివద్ద ఉండిపోయి శనివారం తెల్లవారుజామున బయల్దేరాడు. ఈలోడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో గల ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉంది. ఈ లారీ క్లీనర్ ముందు రోజు సాయంత్రం తూర్పుగాదావరి జిల్లా బిళ్లనందూరులోని తన ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

    సజీవ దహనమైన కన్నాపాత్రుడికి ఇద్దరు పిల్లలు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తుని నుంచి నర్సీపట్నం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు నాతవరం ఎస్‌ఐ పి.రమేష్‌కు సమాచారం  అందించారు.  హుటాహుటిన ఆయన చేరుకునే సరికి లారీ క్యాబిన్ నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వెంటనే నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది, అందులో ఉన్న కన్నాపాత్రుడు పూర్తిగా కాలిపోయి చివరకు కాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
     
    ఈ ఘటన చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాద స్థలానికి న ర్సీపట్నం రూరల్ సీఐ ఎ.దాశరథి చేరుకుని మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం న ర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. లారీలో ఉన్న ఎర్రమట్టి రోడ్డుపై పడిపోవడంతో తుని -నర్సీపట్నం వెళ్లే వాహనాల రాకపోకలు సూమారు రెండు గంటలు స్తంభించిపోయాయి. పోలీసులు ఆ మట్టిని పొక్లైనర్ సాయంతో తొలగించారు.
     

మరిన్ని వార్తలు