భారీగా ఎర్రచందనం పట్టివేత

7 Sep, 2013 02:36 IST|Sakshi

విజయనగరం, న్యూస్‌లైన్:
 శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నెకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు విజయనగరం జిల్లాలో అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను స్వాధీనం చేసుకున్న అధికారులు  అక్కడ ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జిల్లాలోని శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నెకు చెందిన   వ్యక్తి కూడా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 40 లక్షలు అవుతుందని అధికారుల అంచన. వివరాలు.. నాలుగు టన్నులకుపైగా ఎర్రచందనం దుంగలను విజయనగరం జిల్లా గర్భాం గ్రామ సమీపంలో నిందితులు లారీలోకి లోడ్ చేస్తుండగా పక్కా సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. విజయనగరం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.సోమసుందరం ఆధ్వర్యంలో అధికారులు ఎస్.పి.చౌదరి, కె.రామారావు, టి.సుధాకర్, వెంకట్ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కలపను స్వాధీనం చేసుకున్నారు. శిరివెళ్ల మండలం గంప్రమానుదిన్నెకు చెందిన తలారి రామపున్నయ్య సాతాంవలస పరిసర ప్రాంతాల్లో దుంగలను కొనుగోలు చేశాడని అటవీ శాఖాధికారులు తెలిపారు.
 
  సాతాంవలస గ్రామానికి చెందిన పెనుమత్స రవికిషోర్ ఇందుకు సహకరించినట్లు తెలిసిందన్నారు. దుంగలను గర్భాం మామిడితోటలోకి అద్దె ట్రాక్టర్‌లో తరలించి అక్కడి నుంచి లారీలోకి ఎక్కిస్తుండగా పట్టుకున్నామన్నారు. వీటిని కర్నూలుకు చెందిన రామచంద్రనాయుడు కోసం తరలిస్తున్నామని రామపున్నయ్య చెప్పినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి సోమసుందరం తెలిపారు. లారీ డ్రైవ ర్ కె.నాగేశ్వరరావు పరారయ్యాడన్నారు. అతని సెల్‌ఫోన్, డ్రైవింగ్ లెసైన్స్, ఇతర పేపర్లు స్వాధీనం చేసుకుని వాటి ఆధారంగా అతడు నెల్లూరు జిల్లా వర్దానపల్లెకు చెందిన వాడిగా గుర్తించామన్నారు. లారీ, ట్రాక్టర్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దుంగలు కొనుగోలు చేసి తరలిస్తున్న రామపున్నయ్య, ఇందుకు సహకరించిన మత్స రవికిశోర్, ట్రాక్టర్ డ్రైవర్ అదుపులో ఉన్నట్లు తెలిపారు.
 
 
 

మరిన్ని వార్తలు