ఇబ్బందులున్నా.. పని చేయాల్సిందే.

24 Jun, 2016 03:16 IST|Sakshi
ఇబ్బందులున్నా.. పని చేయాల్సిందే.

వైద్యశాఖ హెచ్‌వోడీ కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి కామినేని
 
పనిచేసే చోట అసౌకర్యాలు.. ఇబ్బందులు ఉంటాయని, కొంతకాలం భరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) కార్యాలయంతో పాటు, పారా మెడికల్ బోర్డు, నర్శింగ్ కౌన్సిల్, నర్సింగ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం పాత భవనాల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో వసతులతో కూడిన భవనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఏ ఒక్కరికో ఉంటే సరిపోదని చెప్పారు.

నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి పారా మెడికల్, నర్సింగ్, వైద్యులు ఇలా అందరూ తమ వంతు కర్తవ్యం నెరవేర్చాలని సూచించారు. రాబోయే రోజుల్లో పీహెచ్‌సీలను మరింత బలోపేతం చేయడంతో పాటు, అవసరమైన కొత్తవి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైద్య విద్యార్థులకు ఆగస్టులో ట్యాబ్‌లు అందచేస్తామని, ఫుల్ ల్యాబ్స్‌తోపాటు, సిమ్యులేషన్ సెంట ర్స్, డిజిటల్ లైబ్రరీ, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ సుబ్బారావు, అడిషనల్ డీఎంఈ డాక్టర్ బాబ్జి, పారా మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు, నర్శింగ్ కౌన్సిల్ డిప్యూటీ డెరైక్టర్ వేదమణి, గుంటూరు, రాజమండ్రి జోన్‌ల రీజినల్ డెరైక్టర్ డాక్టర్ డీ షాలినీదేవి, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ టీ రవిరాజ్, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ శశాంక్,  ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం జగన్మోహనరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్‌ఎస్ విఠల్‌రావు, ఏపీ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి రాజారావు, సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన పలు విభాగాల హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు