నీరు-చెట్టు.. అంతా కనికట్టు!

1 Aug, 2015 02:20 IST|Sakshi
నీరు-చెట్టు.. అంతా కనికట్టు!

ఐరాల మండలంలోని 28 పంచాయతీల్లో ఉన్న 38 చెరువుల్లో నీరు-చెట్టు పనులు చేస్తున్నారు. వీటి విలువ రూ.1.5కోట్లు. ఇక్కడ చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద గతంలో తవ్విన పాత గుంతలనే జేసీబీలతో మెరుగులుదిద్దారు. తెలుగుతమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి అధికారులతో కుమ్మక్కై రూ.30 లక్షల మేర బిల్లులు పొందారు. ఇందులో రూ.20 లక్షలు అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం తంతును కింది స్థాయి సిబ్బంది నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదేవిషయాన్ని కొంత మంది రైతులు ఫొటోలతో సహా పక్కా ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు శూన్యం. ఇది మచ్చుకు చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి జిల్లాలో కోకొల్లలు. నీరు-చెట్టు పథకం అంతా కనికట్టుగా మారింది. పచ్చ కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టే కల్పతరువుగా తయారైంది.                                
 
తిరుపతి:   జిల్లాలో నీరు- చెట్టు పథకం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో ఉపాధి హామీ పథకం కింద తీసిన పాత గుంతలు, రైతులు తమ పొలాలకు మట్టితోలిన గుంతలకే మెరుగులుదిద్ది అందినకాడికి అడ్డంగా దోచేస్తున్నారు.
 
అసలు లక్ష్యం ఇదీ
 వ్యవసాయ శాఖఅధికారులు ముందుగా చెరువుల్లోని మట్టిని పరీక్షించాలి. భూసారాన్నిబట్టి పొలాలకు మట్టి తోలచ్చా.. లేదా నిర్ణయించి నివేదిక అందించాలి. ఆపై నీరు- చెట్టు పనులకు అనుమతివ్వాలి. అలా చేయడం వల్ల భూసారం, నీటి నిల్వలు పెంచవచ్చని ప్రభుత్వం భావించింది.

 ఇప్పుడు ఏం జరుగుతోందంటే
 జిల్లాలోని ఏ ఒక్క చెరువులోనూ నిబంధనల మేరకు భూసార పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. అరకొర తీసే మట్టి సైతం కరువు నేపథ్యంలో రైతులు తోలుకునే పరిస్థితి లేదు. ఇదేఅదునుగా కాంట్రాక్టర్లు వెంచర్లతోపాటు ప్రవేటుగా ఇష్టం వచ్చిన చోటికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల పొలాలకు మట్టి తోలకుండానే తోలినట్లు, చెరువులో గుంతలు తవ్వకుండానే తవ్వినట్టు అధికారులతో కుమ్మక్కై రికార్డులు సృష్టిస్తున్నారు. బిల్లులు చేసుకుని జేబులు నింపుకుంటున్నారు.

అంతా మభ్యపెట్టడమే..
 పొరబాటున నీరు-చెట్టు పథకం పనులు తనిఖీలు చేస్తే పచ్చ కాంట్రాక్టర్లు మభ్యపెట్టడానికి పక్కాప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పొలాల మట్టి ఎక్కడని ప్రశ్నిస్తే పైరు పెట్టేందుకు రైతులు నెరిపేశారని, చెరువుల్లో మట్టితీసిన గుంతల కొలతలు వర్షం వచ్చి ఆనవాళ్లు పోయాయని చెప్పడానికి సన్నద్ధమైనట్లు సమాచారం. సంబంధిత అధికారులు కాసులకు కక్కూర్తిపడి పచ్చకాంట్రాక్టర్లకు వంతపాడేపనిలో నిమగ్నమయ్యారు.

 అవసరం లేకున్నా
 ఎకరాలకు 10 వేల రూపాయల ఆయకట్టు అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధన ఉంది. అందుకు భిన్నంగా రేణిగుంట మండలంలో లక్షల రూపాయలు కేటాయిస్తున్నారు. కోట్ర మంగళం చెరువుకు ఇలా రెండు సార్లు రూ.10.65 లక్షలు, రూ.4.85 లక్షలు మంజూరు చేశారు. ఎల్లమండ్యం చెరువుకు రూ.5 లక్షలు, రూ.8.26 లక్షలు మంజూరు చేశారు. ఇక్కడ నిధులు కేటాయించిన మేర ఆయకట్టు లేదు. ఏర్పేడు మండలంలో 45 ఎకరాల చెరువుకు ఇప్పకి వరకు మూడు సార్లు వరుసగా రూ.4.50 లక్షలు, రూ.26 లక్షలు, రూ.6 లక్షలు మంజూరు చేశారు. కుప్పంలో నీరు- చెట్టు నిధులతో  మట్టి తొలగిస్తున్నారు. తరువాత కింద ఇసుక రావడంతో దానిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతకుమునుపు క్యూబిక్ మట్టి తరలిస్తే 29 రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడు అది రూ.40 నుంచి రూ.80కు పెంచడంతో తెలుగు తమ్ముళ్లు పనులు దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు