పద్ధతి మార్చుకోండి

14 Dec, 2014 03:21 IST|Sakshi
పద్ధతి మార్చుకోండి

అధికారులకు సీఎం హెచ్చరిక
 
నగరంలో చంద్రబాబు మూడు గంటల పర్యటన
మున్సిపల్ కమిషనర్, మేయర్‌కు వార్నింగ్
ప్రభుత్వాస్పత్రి  అధికారులపై ఆగ్రహం

 
విజయవాడ : ‘నేను నగరంలో ఉన్నప్పుడే ఇలా ఉంది.. లేకపోతే ఇంకెలా ఉంటుందో.. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఈ రోజు నుంచి మీరు, మేయర్ ఉదయం ఆరు గంటలకు రోడ్లపైకి వచ్చి నగరంలోని శానిటేషన్‌ను మెరుగుపరచాలి. మీ సిబ్బంది అందరినీ రోడ్లపైకి తీసుకురండి. రాజధాని నగరం ఇలాగేనా ఉండేది.. ఐదారుసార్లు నగరంలో పర్యటించి ప్రక్షాళన చేస్తా..’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్,   మేయర్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ‘నేను ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా మీరు ఆలస్యంగా వస్తారా.. ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారు.. మీకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తా. మీ భార్యాపిల్లలకు కష్టం వస్తే తెలుస్తుంది.. మర్యాదగా చెబుతున్నా.. మీరు అలవాట్లు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటా..’ అంటూ పాత ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు విభాగం ఆర్‌ఎంవో డాక్టర్ రవికుమార్, డెప్యూటీ సూప రింటెండెంట్ రమేష్‌లపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం సుమారు మూడు గంటలపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు.

అతిథి గృహం నుంచి బయలుదేరి...

ముఖ్యమంత్రి తొలుత రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఓపెన్ టాప్ జీప్‌లో స్క్యూబ్రిడ్జి వద్దకు వెళ్లారు. అనంతరం రామలింగేశ్వరనగర్‌లోని కృష్ణానది కరకట్ట నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహుదూర్, స్థానికులు పంచకర్ల సాయికుమారి, సుధారాణిలతో పాటు పలువురు స్థానికులు చెప్పిన సమస్యలు విని మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం రూ.52 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 కాల్వల పరిశీలన.

జాతీయ రహదారి మీదుగా బందరు కాల్వ, రైవస్ కాల్వలను సీఎం పరిశీలించారు. నగరంలో కాల్వల ద్వారా జల రవాణా, ఆధునీకరణ తదితర అంశాలను ముఖ్యమంత్రికి మంత్రి దేవినేని ఉమా వివరించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కాల్వగట్లను పరిశీలించిన చంద్రబాబు చెత్తాచెదారంతో నిండి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ హరికిరణ్, మేయర్ కోనేరు శ్రీధర్‌లపై సీరియస్ అయ్యారు. ‘కాల్వగట్లను ఇలాగేనా ఉంచేది.. నేను వచ్చి చెప్పేదాకా బాగుచేయారా..’ అంటూ నిలదీశారు.

ప్రభుత్వాస్పత్రి అధికారులపై ఫైర్ : పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతాశిశు విభాగాన్ని సీఎం తనిఖీ చేశారు. నూజివీడు మండలం యనమందల గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రావణి అనే మహిళ తన బిడ్డకు కడుపులో చీము చేరిందని, వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవని చెప్పగా, రూ.7 వేలు అందజేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. తమకు వైద్యం సరిగా అందడం లేదని, ఒకే బెడ్డుపై ఇద్దరు బాలింతలను పడుకోబెడుతున్నారని, డెలివరీ చేస్తే సిబ్బంది రూ.500 డిమాండ్ చేస్తున్నారని, మందులు సరిగా ఇవ్వడం లేదని, కూర్చునేందుకు బెంచీలు కూడా లేవని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆస్పత్రి డెప్యూటీ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ప్రసూతి విభాగంలో ప్రసవించి అనారోగ్యంతో ఉన్న పిల్లలకు రూ.5 వేలు చొప్పున అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. టీడీపీ నేత దివి ఉమామహేశ్వరరావు చైర్మన్‌గా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నియమిస్తామని చెప్పారు. కలెక్టర్, ఆస్పత్రి అధికారులు కలిసి అభివృద్ధి చేయాలని, ఇందుకోసం తొలుత రూ.5 కోట్లు ఇస్తానని సీఎం పేర్కొన్నారు. డబ్బులు డిమాండ్ చేసే వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆరు నెలల్లో ఆస్పత్రిలో సమూల మార్పు రావాలన్నారు.

 వైఎస్సార్ కాలనీని చూడకుండానే.. : అక్కడ నుంచి జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీని సందర్శించాలని అధికారులు నిర్ణయించారు. చిట్టినగర్ వద్దకు చేరుకునేసరికి చంద్రబాబు మనసు మార్చుకున్నారు. దీంతో సమయం లేక పర్యటనను కుదించారని అధికారులు ప్రకటించారు. 
 

మరిన్ని వార్తలు