మంచు గుప్పెట్లో మన్యం

13 Jan, 2015 01:00 IST|Sakshi
మంచు గుప్పెట్లో మన్యం

లంబసింగిలో 1, పాడేరు ఘాట్‌లో 2, చింతపల్లి, పాడేరుల్లో 4,
మినుములూరులో 5 డిగ్రీల కనిష్ట
ఉష్ణోగ్రతలు నమోదు
 

పాడేరు: విశాఖ ఏజెన్సీలో   5 రోజుల నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత అధికంగా ఉంది. మన్యం  ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీ, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం మరింత చల్లగా ఉంటుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాత్రి వేళల్లో చలి మరింత విజృంభిస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు ఏజెన్సీలో మంచు తెరలు వీడకపోవడంతో వాహన చోదకులు   ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు సూర్యోదయం అయ్యేంతవరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు చలిని తాళలేక అవస్థలు పడుతున్నారు. వేకువజామునే నీళ్ల సేకరణకు వెళ్లే మహిళలు కూడా వణికించే చలితో భయాందోళనలు చెందుతున్నారు.  

సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు  చలికి భయపడి  మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లారు. పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది.  మినుములూరు కాఫీబోర్డు, ఏపీఎఫ్‌డీసీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు, కాఫీ తోటల్లో పనులకు వెళ్లే కార్మికులు  చలికి అవస్థలు పడుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు