చురుగ్గా ఎన్‌ఎస్పీ ఆధునికీకరణ

28 Aug, 2014 01:21 IST|Sakshi
  • ప్రాజెక్ట్సు ఒంగోలు సీఈ  వీ వీర్రాజు
  •  నూజివీడు : ఎన్‌ఎస్పీ మూడోజోన్ పరిధిలోని జిల్లాల్లో రెండేళ్లుగా  రూ.210కోట్లతో నాగార్జునసాగర్ కాలువల ఆధునీకీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని ప్రాజెక్ట్సు ఒంగోలు సీఈ వి.వీర్రాజు అన్నారు. వేంపాడు, నూజివీడు మేజర్ కాలువలపై జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎన్‌ఎస్పీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.90కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయన్నారు.

    కాలువ కట్టల బలోపేతం, కాలువలపై ఉండే అండర్‌టన్నెళ్లు, వంతెనలు, ఎస్కేప్‌లు, లాకులు తదితర వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నూజివీడు, మైలవరం బ్రాంచి కాలువలపై పలు కట్టడాలను నిర్మించాల్సిన రాణి కన్‌స్ట్రక్షన్ కంపెనీ పని సరిగా చేయడం లేదన్నారు. 2011లో  పనిని తీసుకున్నప్పటికీ మొత్తం వర్కులో కేవలం 5శాతం పనులను మాత్రమే ఇప్పటికి పూర్తి చేశారని చెప్పారు. ఇప్పటికే ఆ కంపెనీకి నోటీసులు జారీ చేశామన్నారు.  

    వేంపాడు మేజర్‌పై 40శాతం, నూజివీడు మేజర్‌పై 60శాతం, బాపులపాడు మేజర్‌పై 85శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. తిరువూరు సబ్‌డివిజన్‌లో రూ.52కోట్లకు గానూ ఇప్పటి వరకు రూ.40కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో గతంలో టేకులపల్లి సర్కిల్‌లో ఉన్న జిల్లాలోని ఎన్‌ఎస్పీ కార్యాలయాల పర్యవేక్షణను ప్రస్తుతం పులిచింతల సర్కిల్‌లో కలిపారని తెలిపారు. నూజివీడు సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న 85 మైనర్ల అభివృద్ధికి రూ.40కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు.
     

మరిన్ని వార్తలు