పరీక్షల పేరుతో ఘరానా మోసం

11 Aug, 2015 01:22 IST|Sakshi

 ఏలూరు (సెంట్రల్) : ప్రవేశ పరీక్షల పేరుతో ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన 75 మంది యువతీ యువకులను నగరానికి తీసుకువచ్చి వారి వద్ద నుంచి భారీగా నగదు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని పరారయ్యాడు. దీంతో బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం అలీపూరీ జిల్లాకు చెందిన బిపుల్ బాషా అదే ప్రాంతంలో ఓ కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ప్రవేశ పరీక్షల నిమిత్తం యూనివర్శిటీలకు అభ్యర్థుల ద్వారా ఫీజులను చెల్లింస్తుంటాడు.  కోజ్ బిహర్ జిల్లాకు చెందిన సుమారు 75 మంది బీఈడీ ప్రవేశ పరీక్షల కోసం డబ్బులను చెల్లించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేశాడు. ఈ నెల 6 రాత్రి పరీక్షలకు ఫీజులు కట్టిన వారందరినీ ఏలూరుకు తీసుకువచ్చాడు.
 
 వారు నగరంలోని మాన్య, అన్నపూర్ణ హోటల్స్‌లో రూమ్‌లు తీసుకుని ఉన్నారు. వీరందరి దగ్గర నుంచి ఒరిజినల్ సరిఫ్టికెట్స్ తీసుకునివెళ్లిపోయాడు. సోమవారం పరీక్ష ఉందని చెప్పిన బిపుల్ బాషా ఆదివారం నాటికి కూడా హాల్ టిక్కెట్లు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఫోన్‌లు చేయడంతో బిపుల్ బాషా ఆదివారం రాత్రి మాన్య హోటల్ వద్దకు వచ్చి ఉదయాన్నే పరీక్ష ఉందని, పరీక్ష టైంకు హాల్ టిక్కెట్లను ఇస్తానని చెప్పి, వారితో తన సోదరుడితో పాటుతో అదే హోటల్‌లో ఓ రూమ్‌లో ఉన్నాడు. సోమవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో బిపుల్ బాషా తన సోదరుడితో పాటు పరారయ్యాడు. ఉదయం లేచిన అభ్యర్థులు హోటల్ రూమ్‌లో బాషా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఫోన్ చేయగా ఫోస్ స్విచ్ ఆఫ్ అని రావడంతో వెంటనే స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఏఎంసీ చైర్మన్ కురెళ్ళ రామ్‌ప్రసాద్ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. తర్వాత జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కలిశారు. దీనిపై స్పందించిన ఎస్పీ కోజ్‌బీహర్ ఎస్పీ రాజేష్ జాదవ్‌కు జరిగిన విషయాన్ని చెప్పారు. బిపుల్ బాషా కోచింగ్ సెంటర్‌లో సిబ్బందిని ప్రశ్నించాలని కోరారు.
 
 విడతల వారీగా ఫీజు వసూలు
 జూన్ నెల నుంచి బీఈడీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల నుంచి ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 5 వేలు, తరువాత నెల రోజుల వ్యవధిలో రూ.50 నుంచి 60 వేల వరకు వసూలు చేశాడని బాధితులు పోలీసులకు చెప్పారు. ఏలూరు టూటౌన్ పోలీసులు బిపుల్ బాషాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
 
 అలీపూరీ జిల్లాలో ఆందోళన
 అలీపూరీ జిల్లాలోని బిపుల్ బాషాకు సంబంధిచిన కోచింగ్ సెంటర్ల వద్ద బాధిత తల్లిదండ్రులు, అక్కడి యువకులు ఆందోళన చేస్తున్నట్టు సమాచారం.
 

>
మరిన్ని వార్తలు