సొంతిల్లు..కలేనా?

18 Feb, 2015 02:21 IST|Sakshi

ఒక్క ఇల్లూ మంజూరు చేయని నూతన ప్రభుత్వం
బిల్లులన్నీ పెండింగ్‌లోనే జియో ట్యాగింగ్ పేరుతో జాప్యం
నూతన గృహాల మంజూరు ఎప్పటికో

 
మచిలీపట్నం : పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క గృహాన్నీ మంజూరు చేయకపోగా గతంలో నిర్మించిన ఇళ్లకు బిల్లుల మంజూరు కూడా నిలిపివేయటం గమనార్హం. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా గృహనిర్మాణంపై దృష్టిసారించకపోవటంతో పేదలు గుడిసెల్లోనే కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో గృహనిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న సాకును బూచిగా చూపి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సగం గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం నెలలతరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. గతంలో నిర్మించిన గృహాలు వాస్తవంగా నిర్మించారా, లేదా అసలైన లబ్ధిదారులే ఉన్నారా తదితర వివరాలు సేకరించేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. జిల్లాలో 75 శాతం మేర జియో ట్యాగింగ్ ద్వారా గృహాలను గుర్తించే పని పూర్తయిందని, మరో 25 శాతం ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని గృహనిర్మాణ శాఖ పీడీ సీహెచ్ ప్రతాపరావు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణాజిల్లానే జియో ట్యాగింగ్ ద్వారా గృహాలను గుర్తించే ప్రక్రియలో మొదటి స్థానంలో ఉందన్నారు.
 
పెండింగ్‌లో రూ.12.44 కోట్ల బిల్లులు..

జిల్లాలో 5,765 గృహాలకు రూ.12.44 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2014 మే నెల నుంచి బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీటిని చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఈ అంశాన్ని పక్కనపెట్టేశారు. నూతన గృహ నిర్మాణం చేసే సమయంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అసలు గృహనిర్మాణమే ప్రారంభం కాకపోవటంతో మరుగుదొడ్ల నిర్మాణం కూడా నిలిచిపోయింది.
 
నగదు పెంచుతామన్నారు..  జీవో జారీ చేయలేదు

ప్రస్తుతం పేదలకు నిర్మించే ఒక్కొక్క గృహానికి రూ.70 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే లక్ష రూపాయలు చొప్పున నగదు అందజేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.70 వేలు చొప్పున ఇస్తున్నవారికి లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల స్థానంలో లక్షా 50 వేల రూపాయలకు పెంచి ఇస్తామని పాలకులు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వస్తేనే పెంచిన మొత్తాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు.

జియో ట్యాగింగ్ 75 శాతమే పూర్తి..

2004 నుంచి నిర్మాణంలో ఉండి వివిధ దశల్లో ఉన్న గృహాలను జియో ట్యాగింగ్ పద్ధతిలో ఫొటోలు తీసి కంప్యూటర్‌లో ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీని అమలు కోసం అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అందజేశారు. ప్రతి గృహాన్నీ రెండు ఫొటోలు తీసి శాటిలైట్‌కు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. గతంలో ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు 50 గృహాల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పగా ప్రస్తుతం ఈ సంఖ్యను 100కు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. 2 లక్షల 16 వేల 108 గృహాలను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి ఆన్‌లైన్‌లో ఉంచాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 75 శాతం మాత్రమే పూర్తయింది. 2015 జనవరి 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినా ఆచరణలో అది సాధ్యం కాలేదు. జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాతే పెండింగ్‌లో ఉన్న బకాయిలను లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి బిల్లులు చెల్లిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పటివరకు తాము గుడిసెల్లోనే నివసిస్తూ ఇబ్బందులు పడాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 14,020 గృహాలను పూర్తిచేసి రూ.118.78 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అర్హత లేని లబ్ధిదారులకు గృహాలు నిర్మించటం జరిగిందనే సందేహాలతో గత మూడేళ్లుగా నిలిచిన గృహాలను తనిఖీ చేసేందుకు మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాలు తయారుచేస్తేనే వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామనే నిబంధన విధించారు. అర్హత లేనివారు గృహాలు నిర్మిస్తే ప్రభుత్వం నుంచి ఇచ్చిన నగదును వారి నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మంజూరు చేయిస్తామంటూ అక్రమ వసూళ్లు

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన గృహాల మంజూరు ఇంతవరకు ప్రారంభం కాలేదు. వివిధ దశల్లో ఉన్న గృహాలకు బిల్లుల చెల్లింపులూ చేయలేదు. పాత బకాయిలు రాక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నూతన గృహాలు మంజూరు చేయిస్తామంటూ లబ్ధిదారులకు ఆశ చూపుతున్నారు. గ్రామ, వార్డు, మండల కమిటీల్లో ఉన్న సభ్యులు సూచించినవారికే నూతనంగా గృహాలు మంజూరవుతాయనే ఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా ఒక్కొక్క గృహానికి రూ.4 నుంచి రూ. 5 వేలు చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే నూతన గృహాలకు అనుమతులు వస్తాయని అధికారులు చెబుతుండగా ముందస్తుగానే అధికార పక్షానికి చెందిన కొందరు వసూళ్లకు దిగారు.

మరిన్ని వార్తలు