వేలంపై పితలాటకం

17 Feb, 2016 00:13 IST|Sakshi
వేలంపై పితలాటకం

జిల్లాలో కొలిక్కిరాని ఇసుక ర్యాంపుల వేలం
అధిక ధరలకు బిడ్‌ల దాఖలు.. ర్యాంపులు రద్దయ్యే అవకాశం
ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు
 నూతన ఇసుక పాలసీపై సర్వత్రా విమర్శలు

  
 కొవ్వూరు :జిల్లాలో ఇసుక ర్యాంపుల వేలం పితలాటకంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక పాలసీ విధానం లోపభూయిష్టంగా ఉండడంతో ఇటు అధికారులు, అటు వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 6 ఇసుక ర్యాంపులకు నాలుగు రోజుల కిందట నిర్వహించిన వేలంలో ప్రభుత్వం పేర్కొన్న ధర కంటే అదనపు రేట్లకు కాంట్రాక్టర్లు కోడ్ చేయడంతో వేలం ఖరారు సందిగ్ధంలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో విజయవాడలో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం ఇసుక వేలం ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించింది. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఉపసంఘం సభ్యులైన మంత్రులు ప్రకటించారు.

వేలం రద్దు యోచనలో ప్రభుత్వం
ప్రభుత్వం క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.500గా నిర్ణయించింది. జిల్లాలో వేలం నిర్వహించిన ఆరు ర్యాంపుల్లో రామయ్యపేట మినహా మిగిలిన ర్యాంపులన్నీ అదనపు ధరలకు కోడ్ చేశారు. సిద్ధాంతం ర్యాంపులో రూ.720, పెండ్యాల-కానూరు ర్యాంపులో రూ.646, తీపర్రులో రూ.580, పందలపర్రులో రూ.522 చొప్పున పాడి కాంట్రాక్టర్లు వేలాన్ని దక్కించుకున్నారు. రామయ్యపేటలో మాత్రం రూ.476 పలికింది. ప్రభుత్వ ధర కంటే ఎక్కువగా కోట్ చేయడంతో జిల్లా స్టాండ్ మైనింగ్ కమిటీలో వేలంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని గనుల శాఖ ఏడీ సి.మోహనరావు చెబుతున్నారు. రామయ్యపేట ర్యాంపు పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉండడంతో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాయింట్ కలెక్టర్‌కి లేఖ రాశారు. దీనిపై జిల్లా స్టాండ్ మైనింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో ఈ ర్యాంపు నిర్వహణ ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


 లోపభూయిష్టమైన విధానం
ప్రభుత్వం నూతన ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రభుత్వం క్యూబిక్ ఇసుక ధరను రూ.500కి విక్రయించాలని నిబంధన విధించింది. వేలంలో కనిష్ట ధర రూ.110గా నిర్ణయించింది. దీనిపై అదనంగా పాడుకున్నవారికి వేలం కట్టబెడతారు. ఇసుక తవ్వకం, సీనరేజి, వాణిజ్య పన్ను, ఆదాయ పన్ను, జిల్లా మినరల్ ఫండ్, ర్యాంపుల ఏర్పాట్లు, నిర్వహణ తదితర ఖర్చులన్నీ కలిపి క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకానికి రూ.200 నుంచి రూ.250 వరకు కాంట్రాక్టర్‌కి ఖర్చవుతుంది. ఉదాహరణకు క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.200 నుంచి రూ.250 లోపు వేలంలో దక్కించుకుంటేనే ఆ కాంట్రాక్టర్ క్యూబిక్ మీటర్ రూ.500కు విక్రయించగలడు. అయితే వేలంలో రూ.500 పైబడి బిడ్‌లు దాఖలు చేశారు. వేలం దక్కించుకున్నవారంతా అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు బినామీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా ర్యాంప్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక పరిమాణంతో సంబంధం లేకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాత్రింబవళ్లు తవ్వుకునే కుట్రలో భాగంగానే బిడ్‌లను అధిక ధరలకు కోడ్ చేశారు.  
  
 నూతన విధానంపైనా విమర్శలు
ఇసుక అక్రమ తవ్వకాలతో ఇప్పటికే అప్రదిష్టను మూటగట్టుకున్న టీడీపీ ప్రభుత్వం.. కొత్తగా రూపొందించిన పాలసీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర వద్ద బిడ్ లాక్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అలాచేయకపోవడంతో బిడ్లు హెచ్చు ధరకు వెళ్లాయి.    ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.500కు గరిష్ట ధర నిర్ణయించింది. క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.500కు విక్రయించాలని పేర్కొంది. అయితే వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు క్యూబిక్ మీటర్‌కు దాదాపు రూ.200 వరకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంది. అలాంటి పరిస్థితుల్లో క్యూబిక్ మీటర్‌కు రూ.350లోపే గరిష్ట ధర నిర్ణయించాలని అధికారులే చెబుతున్నారు. జిల్లాలో కరుగోరుమిల్లు ర్యాంపులో క్యూబిక్ మీటర్ ఇసుక ధర ఏకంగా రూ.820 పలికింది. దీనికి ఇతర ఖర్చులు రూ.230 కలిపితే కాంట్రాక్టర్‌కి క్యూబిక్ మీటర్ ఇసుక రూ.1,050 గిట్టుబాటు అవుతుంది. దీనిపై కాంట్రాక్టర్ లాభం వేసుకోవాలి. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దాదాపు రెండు రెట్లు వేసుకుంటే గాని కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కాదు. ప్రభుత్వమే ఇసుక దోపిడీని పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే విమర్శలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు