జిల్లా కొత్త ఎస్పీగా ప్రవీణ్

17 Jul, 2014 00:32 IST|Sakshi
జిల్లా కొత్త ఎస్పీగా ప్రవీణ్
  • ఎల్లుండిబాధ్యతలు స్వీకరణ
  •  ప్రస్తుత ఎస్పీ దుగ్గల్ గ్రేహౌండ్స్‌కు బదిలీ
  •  మావోల ఏరివేత,గిరిజన జాగృతి లక్ష్యమన్న కొత్త ఎస్పీ
  •  స్వస్థలం    :    పశ్చిమగోదావరి జిల్లా
     చదువు    :    రాజమండ్రిలో ప్రాథమిక విద్య కాకినాడలో ఎంబీబీఎస్
     డాక్టరుగా    :    ఏడాదిన్నరపాటు ఢిల్లీలో ఉద్యోగం
     సివిల్స్        :    2009 ఐపీఎస్ బ్యాచ్

     
    సాక్షి,విశాఖపట్నం: జిల్లా కొత్త ఎస్పీగా డాక్టర్ కోయ ప్రవీణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పార్వతీపురం ఓఎస్డీగా   పనిచేస్తోన్న ఆయన్ను ప్రభుత్వం విశాఖ రూరల్ జిల్లా ఎస్పీగా నియమించింది. ప్రస్తుత ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌ను కీలకమైన గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా బదిలీ చేసింది. కొత్త ఎస్పీ ప్రవీణ్ శనివారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

    2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కోయ ప్రవీణ్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. తొలుత ఢిల్లీలోని ఐఆర్‌ఎస్‌లో కస్టమ్స్ విభాగంలో విధుల్లో చేరారు. ఎస్పీగా నియమితులైన ప్రవీణ్ ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం తాను కోర్టుపనిపై హైదరాబాద్‌లో ఉన్నానని, గురువారం విజయనగరం వెళ్లి శనివారం విశాఖరూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు.

    ఎస్పీగా తొలి పోస్టింగ్ రాష్ట్రంలో కీలకమైన విశాఖ జిల్లాకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మావోయిస్టుల ఏరివేతే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. గిరిజనులను చైతన్యవంతం చేయడం, వారికి సరైన ఉపాధి మార్గాలు లభించేలా వారిలో మార్పు తీసుకువస్తానన్నారు. సిబ్బందికి ప్రత్యేకంగా చెప్పేదేంలేదని, పనిచేసే సిబ్బందికి కచ్చితంగా గుర్తింపు ఇస్తానన్నారు.
     
    బాధ్యత పెరిగింది: దుగ్గల్

    2013 జూలై 5న జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్‌జిత్‌దుగ్గల్ సుమారు ఏడాదిన్నరపాటు ఎస్పీగా పనిచేశారు. ఈయన హయాంలో జిల్లాలో కీలకమైన పంచాయతీ,మున్సిపల్, జెడ్పీటీసీ,అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ముగిసేలా చూశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించారు. జిల్లా చరిత్రలో మునుపెన్నడూలేనివిధంగా ఏజెన్సీలో తరచూ పర్యటనలు చేస్తూ గిరిజన యువతకు నైపుణ్యాలు అందించడం, వారితో ముఖాముఖీ నిర్వహించి మావోయిస్టుల పట్ల గిరిజనులు ఆకర్షితులు కాకుండా ఉండడంలో సఫలమయ్యారు. ఏడాది పనితీరుతో జిల్లాలో అందరి ప్రశంసలు పొందారు.

    బదిలీ నేపథ్యంతో దుగ్గల్‌తో ‘సాక్షి’తో మాట్లాడుతూ గ్రేహౌండ్స్ గ్రూప్‌కమాండర్‌గా బదిలీ చేయాలన్న తన విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) మొత్తానికి డిపార్ట్‌మెంట్ తరఫున గ్రేహౌండ్స్ బాధ్యతలు నిర్వర్తించడం కత్తిమీదసామే అన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు విస్తరించిన ఏవోబీలో మావోయిస్టుల నియంత్రణ అంశం మరింత బాధ్యతను పెంచిందన్నారు.
     

>
మరిన్ని వార్తలు