ప్రత్యర్థుల కుట్ర

18 Mar, 2015 01:54 IST|Sakshi

కడప కార్పొరేషన్ : సమాచార లోపం వల్లే జిల్లా సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశానికి డెరైక్టర్లు ఆలస్యంగా హాజరయ్యారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీసీబీ ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి తెలిపారు. తమ ప్రత్యర్థులు కుట్ర పన్ని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీసీసీబీ డెరైక్టర్లంతా వైఎస్ కుటుంబ సభ్యులేనని, వైఎస్ జగన్‌పై వారంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. సోమవారం ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండటంతో టీడీపీ వారు మాయ చేసేందుకు ప్రయత్నించారన్నారు.

ఇందులో భాగంగానే సమావేశం 11గంటలకు ఆలస్యంగా ప్రారంభమవుతుందని వారిని గందరగోళ పరిచారని, బ్యాంకు సిబ్బందితో కూడా ఫోన్లు చేయించారని ఆరోపించారు. చంద్రబాబు వారసులైన టీడీపీ వారికి మాయలు, మోసాలు చేయడం అలవాటేనన్నారు. ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజల్లో వారు ఇప్పటికే అవహేళనకు గురయ్యారని దుయ్యబట్టారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, రైతులు, మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని హామీలు గుప్పించి చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. వీటన్నింటి వల్ల ఎమ్మెల్యేలే ఆ పార్టీలో నిలబడలేకపోతున్నారని, ఈ డెరైక్టర్లు అందులోకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.
 
ప్రస్తుతం 11 మంది సభ్యులు వచ్చారని, సోమవారం ఆ సమావేశానికి వచ్చిన ఇద్దరు సభ్యులు సుదర్శనరెడ్డి, చిన్న ఓబులేసు ఈ సమావేశానికి (ప్రెస్‌మీట్) రాలేకపోయారన్నారు. త్వరలో జరగబోయే డీసీసీబీ సమావేశానికి అంతా హాజరవుతారన్నారు. తమ డెరైక్టర్లందరూ ధృఢ సంకల్పంతో ఉన్నారని, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటే తమ సంఖ్య 15కు పెరుగుతుందని తెలిపారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని చెప్పారు. సమావేశంలో నిన్న సమావేశానికి గైర్హాజరైన చిన్న గురవయ్య, నాగరాజునాయుడుతో పాటు శ్రీనువాసులరెడ్డి, శ్రీనువాసులు సహా 11 మంది డెరైక్టర్లు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు