పీఛే.. ముడ్!

15 Apr, 2014 01:14 IST|Sakshi
పీఛే.. ముడ్!

పార్టీలో సామాజిక న్యాయం వట్టిమాటే
కార్యకర్తల్లో పెరుగుతున్న అసహనం
నియోజకవర్గాల్లో వర్గపోరుతో అతలాకుతలం
17 సీట్లలో ఓటమి ఖాయమని తేల్చిన నాయకులు

 
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రముఖుల చేరిక టీడీపీకి మూడురోజుల మురిపెమే అవుతోంది. కొందరు నాయకులు పార్టీలోకి వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతోందని వారు భావించడమే ఇందుకు కారణం. టికెట్టు ఇప్పిస్తామంటూ తొలుత జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు నగరంలోని ప్రముఖుల వద్దకు వెళ్లడం, తర్వాత పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లి అట్టహాసంగా కండువాలు కప్పి పార్టీలో చేర్పించడం తర్వాత వారిని విస్మరించడం అనవాయితీగా మారింది.
 
ఆ తర్వాత అసలు విషయాన్ని గ్రహించి చేరిన నాయకులందరూ పార్టీని వీడుతున్నారు. తొలినుంచి పార్టీ జెండా మోసిన వారికి మొండి చెయ్యిచూపించడంతో వారు సైతం పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ ఆర్యవైశ్య ప్రముఖుడు కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
 
అప్పటికే టీడీపీలో చేరిన మరో ప్రముఖుడు తొందరపడి పార్టీలో చేరవద్దని తామే బయటకు వస్తున్నామని ఆయనకు తెలిపినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీలో చేరలేదు. అలాగే తొలుత ఆ సామాజిక వర్గానికి టికెట్టు ఇస్తారంటూ ప్రచారం చేసినా ఇప్పుడు ఆ స్థానం ముస్లింలకే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పార్టీలో చేరి లక్షలు ఖర్చుచేసిన నాయకులు గగ్గోలు పెడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గుంటూరు ఈస్ట్ టికెట్టును తమకు ఇస్తామని చేసి న వాగ్ధానాన్ని మరచిపోయారని ఆ సామాజిక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు.
 
అధినేతపై కాపుల గుర్రు.. తమకు జిల్లాలో రెండు సీట్లివ్వాలని ఆది నుంచి కోరుతున్న కాపులకు బాపట్ల సీటు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పై కూడా నియోజకవర్గంలోని ఇతర నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇక మిగిలిన తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఒకటైనా సీటు కేటాయించాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీకి ఎప్పటి నుంచో సేవలందిస్తున్న దాసరి రాజామాష్టారుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయించలేదు.
 
ఆ సమయంలో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామంటూ అధిష్టానం సర్దిచెప్పింది. పశ్చిమ నియోజకవర్గంలో తులసి రామచం ద్ర ప్రభుకు టిక్కెట్టు ఇస్తున్నట్లు ప్రచారం చేసి చివరి నిముషంలో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి సీటు కేటాయించారు. దీంతో తులసీ రామచంద్ర ప్రభు, ఆయన అభిమానులు పిలిచి తమను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
తమ్ముళ్లలో అంతర్గత కుమ్ములాటలు...  జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. కేవలం ఆర్థిక పరపతి ఉన్నవారికే టిక్కెట్లు కేటాయిస్తుండటంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు సత్తెనపల్లి కేటాయించడంతో ఎప్పటి నుంచో ఇక్కడ పోటీ చేయాలని భావించిన నియనిమ్మకాయల రాజనారాయణ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
 
ప్రచారానికే సామాజిక న్యాయం.. ఆర్యవైశ్య, కాపు, బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తామని చేస్తున్న ప్రచారానికి భిన్నంగా జిల్లాలో పరిస్థితి ఉంది. కాపులకు ఒక సీటు కేటాయిస్తే, బీసీలకు సీట్లు తగ్గుతాయని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పరిస్థితిపై నివేదికలు పంపే వారు సైతం సామాజిక న్యాయం కింద అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించకుంటే పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని తెలపడం కొసమెరుపు.
 
ఇప్పటివరకూ ప్రకటించిన జాబితాలో ఒక్కరైనా మహిళ లేకపోవడంపై ఆ వర్గం నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక నూర్‌బాషాలు సైతం తమ వర్గానికి రాష్ట్రంలో ఐదు సీట్లు కేటాయిస్తామన్న చంద్రబాబు మొండిచెయ్యి చూపడంపై వారూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంటే ఏమిటో ఈ ఎన్నికల్లో చూపుతామంటున్నారు.

మరిన్ని వార్తలు