ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

15 Mar, 2015 04:17 IST|Sakshi

తిరుచానూరు: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనీ.. తద్వారా మన భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, మిట్టమీదకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 2014 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్త మ గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు శనివారం వైఎస్‌ఆర్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈసభకు ముఖ్యఅతిథిగా భూమన కరుణాకర్‌రెడ్డి హాజరై ప్రసంగించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిని ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలను చెవిరెడ్డి అందజేయడం అభినందనీయమని తెలిపారు. చదువుతో పాటు పరిసర గ్రామాల ప్రాముఖ్యత, గ్రామం పేరు వెనుక చరిత్ర, ఆ గ్రామాల్లోని మహోన్నత వ్యక్తుల చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు దినచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, తులసీరాం, చెంచులాదేవిలను ఘనంగా సత్కరించారు.
 
ఎమ్మెల్యేలందరికీ చెవిరెడ్డి ఆదర్శం
 నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యేలందరికీ ఆదర్శప్రాయులని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి తెలిపారు.  మిట్టమీదకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రతిభా పురస్కారం ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన సొంత డబ్బులతో చెవిరెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని తెలిపారు.

చెవిరెడ్డి మాట్లాడుతూ  తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించి ఈ స్థాయిలో ఉన్నామని, ఎందరో మహనీయులు, మేధావులు, ప్రతిభావంతుల విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరిగాయని తెలిపారు. అనంతరం 2014 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు ప్రతిభా  పురస్కారాలు అందజేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు జగన్నాధరెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకట్రమణారెడ్డిలను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌నాయుడు, పాతూరు సర్పంచ్ శివలింగారెడ్డి, బ్రాహ్మణపట్టు ఎంపీటీసీ పద్మవేణుగోపాల్, తిరుచానూరు ఎంపీటీసీలు బుజ్జిరెడ్డి, నరేష్‌రెడ్డి, నాయకులు గిరిధర్‌రెడ్డి, మిట్టపాళెం జయచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శివారెడ్డి, యోగానందరెడ్డి, విడుదల మాధవరెడ్డి, చిన్నియాదవ్, దామినేటి కేశవులు, తిరుమలయ్య, రాజేంద్ర, యశోద, నగీనమ్మ, తిరుచానూరు పంచాయతీ ఈవో ఎం.జనార్దన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఉష, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు