బోడి పెత్తనం...

23 Aug, 2013 03:09 IST|Sakshi
విజయనగరం, సాక్షి ప్రతినిధి: పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగిపెట్టిందట. ప్రస్తుతం జిల్లాలో పోలీసుల తీరూ అలాగే ఉంది. జనం ఉద్యమాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కుండా చూడండయ్యా అని పోలీసులకు ప్రభుత్వం నుంచి సూచనలు రాగా వాటిని వారు మరో విధంగా అర్థం చేసుకున్నట్లున్నారు. తాము చేయాల్సిన అసలు పనులను పక్కనబెట్టి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు ప్రతిష్టను కాపాడే బాధ్యతను వారు భుజానికెత్తుకున్నారు. మంత్రిపై ఈగవాలకుండా చూసుకునేందుకు యత్నిస్తున్నారు. 
 
 విభజన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లోని యువత భవిష్యత్ అయోమయంలో పడింది. హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం వెతుక్కుందామంటే అది మనది కాకుండా పోయింది. దీంతో యువత, కూలీనాలీ చేసుకునే జనం ఆవేదనతో రోడ్లెక్కారు.
 
 ఈ తరుణంలోనే అసలు ఇంత అల్లకల్లోలం కావడానికి కారకులెవరు...? ఈ దారుణాన్ని ప్రతిఘటించాల్సిన వారు కనీసం నోరు మెదపకుంటే మరి వారు ఎందుకుఉన్నట్టు..? ఇలాంటి నీచ రాజకీయ నేతలను తాము ఎందుకు ఎన్నుకున్నామా?? అని జనం నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ఇదే క్రమంలో వారి ఉక్రోషం ఉద్యమంగా మారి రోడ్డెకింది. 
 
 బాధ్యులను నిందించకుంటే ఎలా??
 ప్రజలను ఏదైనా కష్టం కలిగితే దానికి కారకులైనవారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, తమకు తోచిన విధంగా నిరసనలు వ్య క్తం చేయడం సహజం. తమ దౌర్భాగ్యానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబే కారణమని కేవలం ఆయన పదవీ కాంక్ష కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. సత్తిబాబు ఇంట్లో నలుగురికి ఓట్లేసి పదవులిచ్చి నెత్తినబెట్టుకున్నందుకు తమకు బాగానే బుద్ధి చెప్పారని ప్రజలు భావిస్తున్నారు. వారు పదవులు, వాటితోబాటు డబ్బూపరపతి సంపాదించారని, ఇప్పుడు వారికి రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని , అందుకే రాష్ట్ర విభజనకు సంబంధించి ఏమీ మాట్లాడడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఆగ్రహాన్ని ఉద్యమ రూపంలో వెళ్లగక్కుతున్నారు. ఏ ఊళ్లో ..ఏ సంఘం ఉద్యమం చేస్తున్నా వారి టార్గెట్ మాత్రం సత్తిబాబు కుటుంబమే. వేలాదిగా వీధుల్లోకి వస్తున్న ఉద్యమకారులంతా సత్తిబాబును, ఆయన పదవీ కాంక్షను, అవకాశవాదాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. 
 
 బాబును ఏమీ అనొద్దు..
 అయితే మన పోలీసులు మాత్రం సత్తిబాబుకు, ఆయన అధికారానికి లొంగిపోయి ‘మీరు ఉద్యమం చేసుకోండి...సత్తిబాబును మాత్రం ఏమీ అనకండి... సమైక్యగళం మాత్రమే వినిపించుకోండి’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంతేకాకుండా రెండ్రోజుల కిందట బొబ్బిలిలో బొత్సకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేయగా వారిని పోలీసులు అడ్డగించి ఆ కార్డులను లాక్కుని ధ్వంసం చేశారు. ఈ ఉదంతం ఉద్యమకారుల్లో మరింత ఆగ్రహానికి కలిగించింది. రాష్ట్ర వినాశనానికి కారకులైన వారిని నిందించకుండా ఎలా ఉంటామని, అసలు తమ ఉద్యమంపై పోలీసుల పెత్తనమేమిటని వారు నిలదీస్తున్నారు. 
 
 మధ్యలో వీళ్లకెందుకట.....?
 కడుపుమండి.. జీవితాలు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో తాము రోడ్లెక్కి ఉద్యమిస్తుంటే మధ్యలో పోలీసుల బాధ ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. సత్తిబాబు ప్రాపకం కోసం పోలీసులు పాకులాడి, ఆయన ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు