జన్మభూమి ఇంటి గుట్టు

3 May, 2016 03:37 IST|Sakshi
జన్మభూమి ఇంటి గుట్టు

సొంత ఇళ్లు ఇప్పిస్తామంటూ వసూళ్లు
జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో నిరుపేదలకు టోపీ
దళారులుగా మారిన తెలుగు తమ్ముళ్లు

 
పేదల సొంత ఇంటి కల తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తోంది. ‘పది వేల రూపాయలు ఇవ్వండి. మీకు సొంత ఇల్లు ఇప్పిస్తాం’ అంటూ తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము చెప్పిన వారికే అధికారులు ఇళ్లు మంజూరు చేస్తారనీ, తమ మాట వినకుంటే అనర్హుల జాబితాలో పెట్టిస్తామని భయపెడుతున్నారు. కొందరు అధికారులకు ఈ వ్యవహారం తెలిసినా అధికారం వాళ్లది తమకెందుకని మిన్నకుంటున్నారు.
 

 
 తిరుపతి కార్పొరేషన్: సావిత్రికి ఇద్దరు పిల్లలు కాగా, ఐదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అంత వరకు అద్దె ఇంటిలో ఉండటం, సంపాదన లేకపోవడం, అద్దె కట్టుకోలేక ప్రభుత్వం కల్పించే సొంత ఇంటి కోసం జన్మభూమి కమిటీ సభ్యుడిని వేడుకుంది.రూ.10వేలు ఇచ్చావంటే ఆన్‌లైన్‌లో నీ పేరు నమోదు చేయించి, ఇల్లు వచ్చేలా మంత్రితో మాట్లాడుతా ’’ అని ఆ కమిటీ సభ్యుడు హామీ ఇచ్చాడు.‘‘ఇళ్లలో పాచిపని చేసుకునే కుమారిది నిరుపేద కుటుంబం. ‘అందరికీ ఇల్లు’ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన చూసి జన్మభూమి కమిటీ సభ్యుడిని ఆశ్రయించింది. అందుకు ఆయన రూ.12వేలు ఇస్తే ఇల్లు ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.’’

ఇదీ  తిరుపతిలో సొంత ఇల్లు ఇప్పిస్తామంటూ జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్న తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు వ్యాపారానికి నిదర్శనం. పట్టణాల్లో ఇల్లులేని ప్రతి కుటుంబానికి 2022 నాటికి శాశ్వత గృహాలు నిర్మించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. అర్హులైన పేదలు  మీసేవ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే దీనిని తిరుపతిలోని తెలుగు తమ్ముళ్లు తమ అక్రమాలకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.


 ఆదాయ మార్గంగా దరఖాస్తులు
 తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 91,811 నివాస గృహాలు ఉండగా 3,74,260 లక్షల మంది జీవిస్తున్నారు. అయితే తిరుపతిలో 4.50 లక్షల మందికి పైగా జీవనం సాగిస్తున్నారని, అందులో సొంత ఇల్లులేని నిరుపేదలు దాదాపు 50 వేల మందికి  పైగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అర్హులు ఈ పథకంలో దళారీలను నమ్మకుండా నేరుగా మీ సేవ కేంద్రంలో రూ.20 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరును జత చేసేలా మార్గదర్శకాలు జారీ చే సింది.
 
 
 రూ.10వేలు ఇస్తే ఇల్లు ఇప్పిస్తాం
 నగరంలో శాశ్వత ఇల్లు లేని నిరుపేదలు దాదాపు 40 వేల మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. అర్హులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ముప్పైరోజుల పాటు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని ప్రచారం కల్పించారు. అయితే ఇప్పటివరకు కేవలం 3వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు కార ణాలు విశ్లేషిస్తే ఆయా వార్డుల్లోని అర్హుల వివరాలు తెలుసుకున్న  తెలుగు తమ్ముళ్లు తమకు తాముగా జన్మభూమి కమిటీ సభ్యులుగా ప్రకటించుకున్నారు. ఇల్లు కావాలంటే తాము రెఫర్ చేయాలని, లేకుంటే అధికారుల దృష్టికి వెళ్లదని చెబుతున్నారు. పైగా మీ దరఖాస్తు  నంబరును మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సొంతిల్లు మంజూరు చేయిస్తామని, అందుకు రూ.10వేలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు.

డబ్బులు ఇచ్చిన వారికే ఇల్లు వస్తుందని దళారుల అవతారం ఎత్తిన నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం తెలియని నిరుపేదలు అమాయకంగా పచ్చ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒక్కో వార్డుకు సరాసరి 550 నుంచి 670 మంది చొప్పున నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి వ్యక్తుల స్థాయిని బట్టి రూ.10 నుంచి రూ.15వేల వరకు దాదాపు రూ.కోటి వరకు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమానికి స్థానికంగా ఉన్న స్వయం సహాయక సంఘాల నాయకులు సైతం సహకరించారని సమాచారం.

దీనిపై ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే, వారిని అనర్హులుగా పక్కన పెడుతున్నట్టు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఆటోనగర్, జీవకోన, బొమ్మగుంట, ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరా నగర్, కొర్లగుంట, మారుతీ నగర్ తదితర ప్రాంతాలకు  చెందిన మహిళలు ఇందులో బాధితులుగా ఉన్నట్లు సమాచారం. తమను అధికార పార్టీ నాయకుల నుంచి కాపాడాలని, కార్పొరేషన్ అధికారులను వేడుకుంటున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు కార్పొరేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. సార్ అధికారం వారిది.. అందులోకి మమ్మల్ని  లాగకండి ప్లీజ్ అంటూ తప్పించుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు