కొత్త రైల్వే జోన్ అవకాశం బెజవాడకే

3 Apr, 2014 02:50 IST|Sakshi
  • రైల్వే శాఖ సన్నాహాలు
  •  మరో జోన్ కావాలని ఎప్పటినుంచో డిమాండ్
  •  ఆదాయం బాగున్నా కేటాయింపుల్లో విదిలింపులే
  •   రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావస్తుండడంతో కొత్త జోన్  ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వే జోన్ కోసం విజయవాడ, విశాఖపట్నం మధ్య పోటీ నెలకొంది. విజయవాడ కేంద్రంగానే ఈ జోన్ ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. దక్షిణమధ్య రైల్వే చాలా పెద్ద జోన్ కావడంతో పరిపాలనాపరంగా కూడా మరో జోన్ కావాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.
     
    సాక్షి, విజయవాడ : దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యధిక ఆదాయం సాధించే డివిజన్‌గా బెజవాడకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా అధిక ఆదాయం వస్తున్నా కేటారుుంపుల్లో మాత్రం చిన్నచూపే చూస్తున్నారు. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన విజయవాడ డివిజన్ ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే కీలక జంక్షన్. దీంతోపాటు కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా సరకు రవాణాపై ఆదాయం సమకూరుతోంది.  
    కొన్నేళ్లుగా విజయవాడ డివిజన్ ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సరకు రవాణాపై కూడా ఏటా ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఎరువులు, సిమెంట్, బొగ్గు తదితరాల రవాణాకు విజయవాడ డివిజన్ కీలకంగా మారింది. మచిలీపట్నం పోర్టు కూడా కార్యరూపం దాలిస్తే డివిజన్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తూర్పు రైల్వేలో ఉన్న విశాఖపట్నాన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేసే జోన్‌లో కలపాల్సిఉంటుంది.
     
     పెండింగ్ ప్రాజెక్టుల్లో కదలిక..
     కొత్త జోన్ ఏర్పాటైతే నిధులు రావడం ద్వారా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో రైల్వే బడ్జెట్‌లో విజయవాడ డివిజన్‌కు మొండిచెయ్యే మిగులుతోంది. కొన్ని ప్రాజెక్టులు మంజూరు చేసినా వాటికి నిధులు మంజూరు కాకపోవడంతో ముందుకు కదలడం లేదు.
     
     15 ఏళ్ల క్రితం మంజూరైన కాకినాడ-కోటిపల్లి-నర్సాపూర్ లైన్ ఇప్పటికీ పూర్తికాలేదు.
     
      కాకినాడ నుంచి కోటిపల్లి వరకు లైన్ పూర్తికాగా, కోటిపల్లి నుంచి నర్సాపూర్ లైన్ పెండింగ్‌లోనే ఉంది.
     
     కోటిపల్లి-నర్సాపూర్ మధ్య 57 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.695 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికి రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు.
     
     కాకినాడ-పిఠాపురం మధ్య 21 కిలోమీటర్ల లైన్‌కు రూ.85.51 కోట్లు బడ్జెట్ కాగా, ఇప్పటివరకు లక్షల్లోనే కేటాయింపులు జరిగాయి.
     
     ఓబులాపురం-కృష్ణపట్నం మధ్య 113 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.732.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికి సగం ఖర్చు కూడా కాలేదు.
     
     రాయనపాడు వర్క్‌షాపు ఆధునికీకరణ కోసం రూ.12.61 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు.
     
     విజయవాడ ఎలక్ట్రికల్ లోకో షెడ్  సామర్థ్యాన్ని 120 ఇంజిన్ల నుంచి 175 ఇంజిన్లకు పెంచడానికి రూ.12.50 కోట్లు మంజూరై ఐదేళ్లు దాటినా నిధులు మాత్రం రావడం లేదు.
     
     గద్వాల్-రాయచోటి లైను నిర్మాణం, గుంతకల్-బెంగళూరు, సికిందరాబాద్-ముంబై మధ్య విద్యుదీకరణ పనులు కూడా ముందుకు సాగడం లేదు.
     
     కొవ్వూరు-భద్రాచలం, కృష్ణపట్నం-కడప రూట్లలో కొత్త రైలుమార్గం ఏర్పాటు గత బడ్జెట్లకే పరిమితమైంది.
     
     విజయవాడ డివిజన్‌కు పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ సెంటర్ వస్తుందని భావించారు. అదీ రాకపోవడం కొంత నిరాశకు గురిచేసింది.
     
     గుంటూరు-తెనాలి-విజయవాడ మధ్య, విశాఖపట్నానికి మెట్రో రైళ్లు వేస్తామన్న హామీలు కూడా నెరవేరతాయన్న ఆశ ఈ ప్రాంతంలో కనపడుతోంది.
     

మరిన్ని వార్తలు