నిట్‌పై రభస

20 Sep, 2014 04:01 IST|Sakshi
నిట్‌పై రభస

- ఏలూరు ప్రాంతంలోనే ఏర్పాటు చేయూలని టీడీపీ ప్రజాప్రతినిధుల పట్టు
- తాడేపల్లిగూడెంలోనే కావాలంటున్న మంత్రి పెడికొండల
- మంత్రిపై జెడ్పీ చైర్మన్ బాపిరాజు అసహనం
- ప్రతిష్టాత్మక సంస్థను జిల్లాకు దక్కనిస్తారా ?
 ఏలూరు సిటీ : ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు విషయంలో జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య పోరు మొదలైంది. ఏలూరు పరిసర ప్రాం తాల్లోనే ఆ సంస్థను ఏర్పాటు చేయించేందుకు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తుంటే.. తాడేపల్లిగూడెం ప్రాంతంలోనే ఏర్పాటు చేయూలంటూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, గన్ని వీరాంజనేయులు, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ పట్టుబడుతున్నారు.

ఈ నేపథ్యంలో నిట్ ఏర్పాటుకు అనుకూల మైన ప్రాంతాలను పరిశీలించేందుకు శుక్రవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కేంద్ర బృందం ఎదుట ఈ అంశంపై జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు వాదులాటకు దిగారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములను మంత్రి శ్రీనివాసరావు, అధికారులు పరిశీలిస్తుండగా.. నిట్ ఏర్పాటుకు ఈ భూములు అనుకూలంగా ఉంటాయని మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వారికి చెప్పారు. ఈ దశలో జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘వాళ్లకు మీరేమీ చెప్పనక్కర్లేదు. జిల్లాలో మేం చాలామందే ఉన్నాం. నిట్ ఎక్కడ పెట్టాలనే విషయమై జిల్లా నేతలంతా చర్చించి నిర్ణయిస్తాం. అనవసరంగా మాట్లాడొద్దు’ అంటూ మంత్రి మాణిక్యాలరావు, పితానిపై వాగ్యుద్ధానికి దిగారు. ఈ భూముల్ని నిట్‌కు కేటాయిస్తే.. విమానాశ్రయం మాటేంటని ఆయన ప్రశ్నిం చారు. నిట్ కోసం వేరే భూములు సిద్ధంగా ఉన్నాయని అధికారుల బృందానికి బాపిరాజు చెప్పారు.
 
జిల్లాకు దక్కనిస్తారా
ఒకటి కాదు.. రెండుకాదు సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులతో ఏర్పాటు చేసే నిట్ వ్యవహారం జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య పోరుకు దారి తీసింది. తమ ప్రాంతంలో నిట్ ఏర్పాటు చేయిస్తే డబ్బుతోపాటు ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవచ్చన్న తపనతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ‘పిల్లి పోరు.. పిల్లిపోరు పిట్టతీర్చింది’ అన్నచందంగా చివరకు ప్రజాప్రతినిధులు నిట్‌ను జిల్లాకు రానిస్తారా లేక దీని కోసం ఆశగా ఎదురు చూస్తున్న పక్క జిల్లాల వారికి ధారాదత్తం చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
 
ప్రస్తుతానికి నిట్ ఏర్పాటు తాత్కాలికమే
జిల్లాలో నిట్ ఏర్పాటుకు కేంద్ర బృందం శుక్రవారం పరిశీలించిన భూములన్నీ అటవీ శాఖ పరిధిలో ఉన్నాయి. పెదవేగి మండలం రామసింగవరంలో 3,500 ఎకరాల అటవీ భూమి ఉంది. ప్రస్తుతానికి 186 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. తాడేపల్లిగూడెంలో 1,200 ఎకరాలకు పైగా విమానాశ్రయ భూములు ఉన్నాయి. వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంతంలో 3,200 ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ భూములను డీ నోటిఫై చేయాలంటే కనీసం ఏడాదిన్నర కాలం పడుతుందని అధికారులు అంటున్నారు. ఈలోగా పొరుగు జిల్లాల్లో ఏ సమస్యాలేని 300 ఎకరాల భూమిని సిద్ధం చేసి నిట్‌ను అక్కడికి మార్చేస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన మొదలైంది.

ఈ విద్యాసంవత్సరంలోనే నిట్‌ను ప్రారంభించాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన ఆధునిక భవనాలు నిర్మించాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. భూముల సేకరణకే పుణ్యకాలం గడిచిపోతే ఎలాగనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఇక్కడి ఇంజినీరింగ్ కళాశాలల్లో నిట్‌ను ఏర్పాటు చేసి, అనంతరం శాశ్వత భవనాల్లోకి మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జాతీయ సాంకేతిక విద్యామండలి నిబంధనలకు అనుగుణంగా ఇంజినీరింగ్  కాలేజీల్లో  తాత్కాలిక ప్రాతిపదికన నిట్‌ను ప్రారంభించేందుకు అనువైన ఇంజనీరింగ్ కళాశాలలను ఎంపిక విషయంలోనూ తీవ్ర పోటీ నెలకొంది.

ఏలూరులోని సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్‌లో నిట్‌ను తాత్కాలి కంగా ఏర్పాటు చేయాలని ఓ వర్గం, తాడేపల్లిగూడెంలోని ఆకుల శ్రీరాములు ఇంజినీరింగ్, వాసవి ఇంజినీరింగ్, శశి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏదో ఒకచోట ఏర్పాటు చేయూలనే మరో వర్గం డిమాండ్ చేస్తున్నారుు. మంత్రులతోపాటు, అధికారుల బృం దాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా కాలేజీల యాజమాన్యాలు రంగంలోకి దిగాయి. జాతీయస్థాయిలో ఖ్యాతితోపాటు, నిధులు సైతం రాబట్టుకోవచ్చనే ఆలోచనతో యాజ మాన్యాలు తమ కాలేజీలోనే తాత్కాలికంగా నిట్ ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారుు. ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రతినిధి అయితే ఏకంగా జిల్లాకు చెందిన మంత్రిని కలిసి ‘నిట్‌ను మా కాలేజీలో పెట్టిస్తానన్నారుగా.. ఇప్పుడు ఇన్ని పేర్లు చెబుతున్నారేంటి’ అని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు