నిర్లక్ష్యానికి మూల్యం

26 Jun, 2014 02:52 IST|Sakshi
నిర్లక్ష్యానికి మూల్యం

సాక్షి, నెల్లూరు: ఎప్పటికి పూర్తవుతాయో తెలియని స్థితిలో నత్తనడకన సాగుతున్న భవన నిర్మాణ పనులు. పెపైచ్చు నాసిరక నిర్మాణాలు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు తనిఖీ చేసే నాటికి సమకూరని వసతులు. వెరసి ఈ ఏడాది కూడా నెల్లూరు మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీ కలగానే మిగలనుంది. మెడికల్ కళాశాలలో  సకాలంలో వసతులు ఏర్పాటు పూర్తికాక పోవడంతో  సింహపురి కళాశాలకు చెందిన 150 సీట్లతో పాటు  రాష్ట్రంలో మొత్తం 350  ఎంబీబీఎస్ సీట్లను  మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  రద్దు చేసిన విషయం విదితమే. ఇదే విషయంపై రాష్ట్ర వైద్య,ఆరోగ్య,వైద్యవిద్యా శాఖ మంత్రి  కామినేని శ్రీనివాస్  మంగ ళవారం అధికారులతో సమీక్షించారు. రద్దైన ఎంబీబీఎస్ సీట్లు తిరిగి వచ్చే అవకాశం కనిపించడంలేదని ఆయన విలేకరులకు తెలిపారు.
 
 గత ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోగా తీరా నిధులు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు  భవననిర్మాణాల విషయంలో మరింత నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చే యించాల్సిన అధికారులు సైతం ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు  మరింత ఆలస్యమయ్యాయి.
 
 పర్యవసానంగా ఈ నెల మొదట్లో మెడికల్  కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం వచ్చేనాటికి  వసతులు సమకూరక పోవడంతో  వారు ఈ ఏడాది అడ్మిషన్లకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండో ఏడాది కూడా  సింహరి మెడికల్ కళాశాలలో సీట్లు భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. మెడికల్ కళాశాల పనుల నాణ్యత సైతం ప్రశ్నార్థకంగా మారింది. నాలుగురోజుల క్రితం సాక్షాత్తు కలెక్టర్ శ్రీకాంత్ ఈ పనుల నాణ్యతను అడుగడుగునా పరిశీలించిన అధికారుల పై మండిపడ్డారు. ఇవేం పనులు అంటూ మండిపడిన విషయం తెలిసిందే.  
 
  వైద్యకళాశాల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి 2013-14కు కళాశాలను ప్రారంభిస్తామన్న అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. రూ.362 కోట్ల నిధులకు గాను తొలుత కేవలం నామమాత్రంగా  రూ.20 కోట్లు మాత్రమే మంజూరు చేసి ఆయన చేతులు దులుపు కున్నారు. వైద్యకళాశాల పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కే అన్నట్టు ఉండిపోయాయి.
 
 ఇటీవల మరో రూ.80 కోట్లు నిధులు మంజూరు చేసినా  నిర్మాణ పనులను అధికారులు, నేతలు పట్టించుకోక పోవడంతోనే వైద్యకళాశాల సకాలంలో పూర్తికాలేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం వైద్యకళాశాలకు సంబంధించి పరిపాలన భవనం,సిబ్బంది వసతి గృహాలు, బాలురు, బాలికల వసతి గృహాల  పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కావడంతో పాటు ప్రొఫెషర్స్,అసిస్టెంట్ ప్రొఫెషర్స్,సిబ్బంది నియామకం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సకాలంలో పూర్తి కావాల్సి ఉంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్  పరిశీలించి సంతృప్తి చెంది గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే  వైద్యకళాశాల ప్రారంభ మౌతుంది. ఈ నెల ప్రారంభంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వచ్చి పరిశీలించే నాటికి పనులు పూర్తికాలేదు.  పర్యవసానంగా ఈ ఏడాది సైతం విద్యార్థులు 150 సీట్లను కోల్పోవలసి వస్తోంది.
 
 కళాశాల మంజూరు: నెల్లూరుకు వైద్యకళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం 2012లో జీఓ జారీ చేసింది. ప్రస్తుత డీఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని 80 ఎకరాల స్థలంలో  రూ.362 కోట్లతో  ప్రభుత్వ వైద్యకళాశాలను నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌పాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కళాశాల నిర్మాణానికి అనుమతులు వెలువడ్డాయి.
 
 ఆర్భాటంగా ప్రకటించిన నాటి మంత్రి
 వైద్యకళాశాల నమూనాలను ఎస్‌ఎస్ కన్సల్టెంట్ తయారు చేయగా  అప్పటి మంత్రి,వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు నెల్లూరులో ఆర్భాటంగా సమావేశం నిర్వహించి కళాశాల నిర్మాణం తీరుతెన్నులను వివరించారు. తొలుత 150 సీట్లతో వైద్యకళాశాలను ప్రారంభించినా  భవిష్యత్తు తరాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 260 సీట్లకు కళాశాలను పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి గొప్పలు చెప్పారు. అందుకు అనుగుణంగా భవనాల నిర్మాణాలను చేపడుతున్నామని, అవసరమై నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని కూడా నాడు మంత్రి ఆనం ప్రకటించారు. సకాలంలో నిధులు మాత్రం ఇవ్వక పోవడంతో మెడికల్ కళాశాల పనులు ఆలస్యమయ్యాయి.  
 
  వైద్యవిద్యార్థులకు మొదటి సంవత్సరంలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. అనాటమీకి థియేటర్, మిగిలిన వాటికి ల్యాబ్‌లు తప్పనిసరి. ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్స్,ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌తో పాటు పది మంది ట్యూటర్లు అవసరమవుతారు. వీరితో పాటు కార్యాలయాల సిబ్బంది సరేసరి. ఈ లెక్కన వందలాది మంది సిబ్బంది నియామకం జరగాల్సి ఉంది.
 
 నిబంధనల మేరకు కళాశాల నిర్మాణం పూర్తయి మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్యపరికరాలతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయని భారతీయ వైద్యమండలి కళాశాల నిపుణులు సంతృప్తి చెందితేనే విద్యార్థులకు వైద్యకళాశాలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ లెక్కన మిగిలిన దాదాపు రూ.300 కోట్లు నిధులు ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేస్తే తప్ప వచ్చే ఏడాదైనా వైద్యకళాశాల ప్రారంభం అవుతుందా అన్నది అనుమానమే.
 

>
మరిన్ని వార్తలు