ఇలాగైతే బతికేదెలా?

27 May, 2014 02:42 IST|Sakshi
ఇలాగైతే బతికేదెలా?

 లేపాక్షి/తనకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, న్యూస్‌లైన్ :  సామాజిక భద్రత పింఛన్‌ను నిలిపివేయడంపై జిల్లాలో నిరసన పెల్లుబికింది. లేపాక్షి, తనకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు మండలాల్లో ఆందోళనకు దిగారు. పింఛన్‌ను పునరుద్ధరించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేపాక్షి మండలంలో పింఛన్ రద్దయిన వారు సోమవారం ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులందరినీ బయటకు పంపి.. కార్యాలయానికి తాళం వేశారు.

అనంతరం కార్యాలయం ఎదుట మండుటెండలోనే ధర్నా చేశారు. వీరికి మాజీ ఎంపీపీలు కొండూరు మల్లికార్జున, ఆనంద్, లేపాక్షి సర్పంచ్ జయప్ప, మాజీ సర్పంచ్ రవీంద్రనాథ్, నాయకులు గంగిరెడ్డి, శ్రీనివాసులు తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతికి ఉన్నా చనిపోయారని, స్మార్‌‌టకార్డులు లేవని, వేలిముద్రలు కంప్యూటర్లు తీసుకోలేదని కారణాలు చూపుతూ పింఛన్ రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
చనిపోయిన వారిని జాబితా నుంచి తీసేయకుండా.. వారి పేరిట వచ్చే పింఛన్ సొమ్మును సిబ్బంది స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. రెండు నెలలుగా వెయ్యి మందికి పింఛన్లు పంపిణీ చేయడం లేదని తనకల్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ముట్టడించారు. యాక్సిస్ బ్యాంకు సిబ్బంది చేసిన పొరపాట్ల వల్లే తమకు పింఛన్ అందకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల పింఛన్‌ను వచ్చే నెలలో ఒకేసారి మంజూరయ్యేలా చూస్తామని ఈఓపీఆర్‌డీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. వీరి ఆందోళనకు ఏపీ రైతు సంఘం మండల కన్వీనర్ రమణ మద్దతు తెలిపారు. ‘అయ్యా.. కొన్నేళ్లుగా నెలనెలా ఇన్నూరు..ఐదునూర్లు.ఫించన్ తీసుకునేవాళ్లం. వచ్చిన ఫించన్‌తో నెలపాటు అవసరాలు తీరేవి.
 
 రెణ్నెళ్లుగా ఫించన్ ఈలేదు. మా ఫించన్ ఏమైంది?’ అంటూ బోరంపల్లికి చెందిన వికలాంగులు, వితంతువులు, వృద్ధులు కళ్యాణదుర్గం తహశీల్దార్ శ్రీనివాసులు వద్ద ఏకరువు పెట్టారు. దీంతో తహశీల్దార్ సంబంధిత అధికారులతో విషయం కనుగొన్నారు. వేలిముద్రల సమస్యలతో జాప్యం జరిగిందని, వచ్చే నెలలో పెడింగ్ పింఛన్‌తోపాటు మొత్తం అందుతుందని హామీ ఇచ్చారు. అనంతరం బాధితులు అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఈఓఆర్‌డీ క్రిష్ణమూర్తి వద్ద కూడా గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వచ్చే నెలలో ఫించన్లు అందుతాయని ఈఓఆర్‌డీ హామీ ఇచ్చారు.
 
 ‘సార్... మూడేళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నాం.. రెండు నెలలుగా 40 మందికి పింఛన్ ఇవ్వడం లేదు.. ఎలాగైనా పింఛన్ వచ్చేలా చూడండి’ అని కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన వృద్ధులు ఎంపీడీఓ నాగేశ్వర్‌రావుతో గోడు వెళ్లబోసుకొన్నారు. బ్రహ్మసముద్రం గ్రామంలో 20 మందికి పింఛన్ రావడం లేదని వైఎస్సార్‌సీపీ సర్పంచు లోకేష్‌గౌడ్ ఎంపీడీఓ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ వచ్చేలా చూస్తానని ఎంపీడీఓ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు