రోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి

20 Sep, 2014 01:02 IST|Sakshi
  • పీఆర్ ఇంజినీర్ల వర్క్‌షాప్‌లో మంత్రి అయ్యన్న
  • విశాఖ రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ఇంజినీర్లు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు.

    ఈ శాఖకు క్వాలిటీ కంట్రోల్ విభాగం కీలకమని, దాన్ని పటిష్టపర్చి రానున్న కాలంలో అన్ని రకాల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూస్తామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు పర్చే అంశంపై పూర్తి స్థాయిలో మేధోమథనం చేయాలని ఇంజినీర్లకు సూచించారు.

    జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ  గ్రామాల్లో నాణ్యమైన రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని పేర్కొన్నారు. పంచాయతీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలనే లక్ష్యంతో రోడ్, వాటర్, పవర్, గ్యాస్, ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందని పేర్కొన్నారు. వీటి నిర్మాణంలో సమస్యలు తల్తెకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు.

    కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. పీఆర్ ఇంజినీర్-ఇన్-చీఫ్ సి.వి.ఎస్.రామ్మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామని, వీటి నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజినీర్లను ఆదేశించారు.  

    గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ కనెక్టవిటీని పెంచేందుకు ఈ వర్క్‌షాపులో సుమారు రూ.100 కోట్లకు తక్కువ కాకుండా ప్రతిపాదనలు ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెడీ రెకనానర్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటేశ్వరరావు, నాబార్డు సీఈ పద్మజ, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రవీంద్రనాథ్, ఈఈ ఎల్.కృష్ణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కాంతానాథ్ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు