కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర

27 Feb, 2014 02:20 IST|Sakshi
  •     పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం
  •      మేడపల్లి సబ్‌స్టేషన్ ముట్టడి
  •  నల్లబెల్లి, న్యూస్‌లైన్ : మండలంలో ఇష్టానుసారం విధిస్తున్న కరెంటు కోతలతో విసిగి వేసారిన మేడపల్లి సమీప గ్రామాల రైతులు బుధవారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి, మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయని, ఈ సమయంలో వేళాపాలా లేకుండా విధిస్తున్న కరెంటు కోతలతో నష్టపోయే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ పరిధిలో మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి, కొండాపురం గ్రామాల రైతులు ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని, ఈ క్రమంలో కరెంటు తరచూ నిలిచిపోవడం వల్ల మోటార్లు సరిగా నడవక పంటలు ఎండిపోతున్నాయన్నారు.

    ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఆందోళన మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. ఈ సమయంలో ఏఈ బ్రహ్మయ్య భయపడి అక్కడికి వెళ్లకపోవడంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఆందోళన కొనసాగిస్తూనే మరోవైపు ఫోన్లద్వారా పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అధికారులు స్పందించి వెంటనే ఏఈని అక్కడికి పంపించి గ్రామాలకు రోజుకు 18గంటలు, వ్యవసాయానికి ఏడు గంటలు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని లిఖిత పూర్వక హామీ ఇప్పించారు. శాంతించిన రైతులు ఆందోళన విరమించారు. రైతులకు మద్దతుగా సర్పంచ్‌లు బాదావతు రవి, విడియాల రేవతీప్రభాకర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంగ పోషాలు, నాయకులు మోహన్‌రావు, సురేశ్‌రావు ఆందోళనలో పాల్గొన్నారు.         

>
మరిన్ని వార్తలు