ప్రత్తిపాటిపై గట్టి బాధ్యత

12 Jun, 2014 00:21 IST|Sakshi
ప్రత్తిపాటిపై గట్టి బాధ్యత

సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాకు గత ఆనవాయితీ కొనసాగింది. రాష్ట్ర కేబినెట్‌లో ఈ సారీ జిల్లాకు వ్యవసాయశాఖ దక్కింది. స్వతహాగా వ్యవసాయ కుటుంబానికి చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ శాఖ లభించింది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతాంగానికి న్యాయం చేయాలంటే పుల్లారావుపై గట్టి బాధ్యతే పడిందని చర్చజరుగుతోంది. కుటుంబ నేపథ్యం వ్యవసాయసంబంధమైనదే అయినా ఈయన మొదటి నుంచి వ్యాపారవేత్తగానే కొనసాగారు.
 
 అయితే ఆయన పత్తి మిల్లులు, స్పిన్నింగ్ మిల్లులే నిర్వహిస్తుండటంతో వ్యవసాయంపై కొంత అవగాహన ఉందనే చెప్పవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రైతులు ఎదుర్కోబోయే సమస్యలు, రైతు రుణమాఫీ హామీ అమలు, జిల్లాకు అతిముఖ్యమైన వరి, వేరుశనగ విత్తనాలపై సబ్సిడీ ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తలెత్తే సమస్యను ప్రత్తిపాటి ఏవిధంగా పరిష్కరిస్తారోననేది అందరిలోనూ ఆసక్తికలిగించే అంశం.
 
 రుణమాఫీ అమలు ఎలావుంటుందో.: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. అయితే అధికారం చేపట్టగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబునాయుడు కేవలం కమిటీ ఏర్పాటు చేస్తామని తేల్చేశారు. కమిటీ నివేదిక వచ్చి రుణమాఫీపై నిర్ణయం తీసుకోవాలంటే సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంలో కొత్తగా బాద్యతలు చేపట్టనున్న ప్రత్తిపాటి ఏం చేస్తారనేదే తేలాల్సి ఉంది.
 
 తైవాన్‌స్ప్రేయర్లు... టార్పాలిన్ పట్టలపై సబ్సిడీ ఉంటుందా?
 రైతులకు సబ్సిడీ ధరల్లో అందించాల్సిన తైవాన్ స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టలు, గత ఏడాది నుంచి ఇంత వరకు రైతులకు అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నూతన ప్రభుత్వంపై వారు ఆశలు పెట్టుకున్నారు.
 
  2007కు ముందు వరి, వేరుశనగ విత్తనాల ధరలు మండిపోతూ రైతులకు భారంగా మారడంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేంద్రంతో మాట్లాడి రైతులకు వరి విత్తనాలు కిలో రూ. 5లు, వేరుశనగ విత్తనాలకు కిలోకు రూ. 18 లు చొప్పున సబ్సిడీ ఇప్పించే ఏర్పాటు చేశారు. దీంతో రైతులకు కొంత ఊరట కలిగింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఆ సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై కొత్త వ్యవసాయ శాఖ మంత్రి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 సాగర్ ఆయకట్టుపై ఆందోళన
 రాష్ట్ర విభజన నేపధ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు వరి పండించేందుకు నీటి విడుదల ఆశించిన స్థాయిలో రాదనే ఆపోహలతో వీరంతా మెట్టపంటలైన ప్రత్తి, మిర్చి పంటలు వేసేందుకు సిద్దమయ్యారు. మరోవైపు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ అధికారులు ముందే వెల్లడించారు. దీంతో వర్షాలపై ఆధాపడే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వీటన్నింటిని ఎదుర్కొని వ్యవసాయశాఖామంత్రిగా పుల్లారావు ఏ మేరకు సఫలీకృతమవుతారో వేచి చూడాలి.
 

మరిన్ని వార్తలు