గ్రామ పాలన.. నిర్లక్ష్య నీడన!

17 Jan, 2014 03:33 IST|Sakshi

 జిల్లాలోని పంచాయతీ భవనాలకు సొంత భవనాలు లేక పోవడంతో అనేక సమావేశాలు ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, దేవాలయాలు, రచ్చకట్టలపైనే నిర్వహిస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లోని పంచాయతీ కార్యాలయ భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరుకొని, కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 420 గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
 
 అయితే 387 భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుమతులు లభించాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల మేర రూ.38.70 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతానికి 286 భవన నిర్మాణాలు మాత్రమే పూర్తి అయ్యాయి. 22 ప్రాంతాల్లో స్థల సమస్య అడ్డురాగా, వివిధ కారణాలతో 11 ప్రాంతాల్లో నేటికి పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి.
 
 పంచాయతీ భవన నిర్మాణాల పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. అనేక గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉన్నా, ఆయా కార్యాలయాల్లో తగిన ఫర్నీచర్ సౌకర్యం లేదు. కొన్ని కార్యాలయాల్లో కేవలం రెండు, మూడు కుర్చీలే గతి. వార్డు సభ్యులతో పాటు, వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా నిలబడే ఉండాల్సి వస్తోంది. మరి కొన్ని కార్యాలయాలకు విద్యు సౌకర్యం లేకపోవడం గమనార్హం.
 
 పంచాయతీ భవనాల పరిస్థితి ఇది:
  ఆదోని మండల పరిధిలోని సంతెకుళ్లూరు, మధిరె, హానవాలు, పాండవగల్లు, గణేకల్, బసాపురం,  బసరకోడు గ్రామాల్లో పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సంతెకుళ్లూరు భవనం పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉంది.
 
  ఆళ్లగడ్డ మండలంలో 18 పంచాయతీలు ఉండగా ఒక్క పంచాయతీకి కూడా సచివాలయం భవనం లేదు. కోటకందుకూరు, బత్తలూరు, చింతకొమ్మదిన్నె గ్రామాల్లో పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఒక్కటే భవనంలో ఉన్నారు.
 
  చాగలమర్రి మండలంలో 18 పంచాయతీలు ఉండగా రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 12 పంచాయతీలకు భవనాల్లేవు.
 
  శిరివెళ్ల మండలంలో 13 పంచాయతీలు ఉండగా మూడు పంచాయతీల్లో స్థలం సమస్యతో భవన నిర్మాణాలు ప్రారంభించలేదు. ఐదు పంచాయతీల్లో పాతభవనాలు శిథిలావస్థకు చేరుకోగా మిగిలిన ఐదు పంచాయతీల్లో భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
  రుద్రవరం మండలంలో 20 పంచాయతీలకుగాను 9 పంచాయతీ కార్యాలయాలకు భవనాలు పూర్తి కాగా, ఆరు గ్రామాల్లో స్థలం సమస్యతో భవన నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఐదు పంచాయతీల్లో భవన నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తికాలేదు. ఆలూరు మండలంలో 14  గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హుళేబీడు, మూసానపల్లి తదితర గ్రామ పంచాయతీలతో పాటు మరో ఆరు గ్రామ పంచాయతీలకు కార్యాలయాలు లేవు. ఆస్పరి మండలంలోని బనవనూరు, పి.కోటకొండతో పాటు మరో నాలుగు గ్రామ పంచాయతీల్లో పంచాయతీ భవన నిర్మాణాలు కొనసాగుతునే ఉన్నాయి.
 
  హాలహర్వి మండలంలోని బాపురం, హాలహర్వి తదితర గ్రామాలతో పాటు మరో 11 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కొత్త భవనాల ఏర్పాటుకు ముందుకొచ్చింది. వివిధ కారణాల చేత ఆ భవనాలు ఇంకా పూర్తి కాలేదు. గూళ్యం గ్రామంలో స్థల సమస్య ఉంది.
 
  చిప్పగిరి మండలంలోని దౌల్తాపురం, ఖాజీపురం, గుమ్మనూరు, డేగులపాడు, చిప్పగిరి తదితర గ్రామాల్లో భవన నిర్మాణాల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
 
  దేవనకొండ మండలంలోని తెర్నెకల్, ఐరన్‌బండ, అలారుదిన్నె, కప్పట్రాళ్ల, పి.కోటకొండతో పాటు మరో రెండు గ్రామ పంచాయతీల్లో కార్యాలయాలు లేవు. ్ల నెల్లిబండ, చెల్లిచెలమల గ్రామాల్లో పనులు మధ్యలో ఆగిపోయాయి.
 
  ఆత్మకూరు మండలంలోని ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట, కరివేన, బాహ్మణాంతపురం, ముష్టపల్లి పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరాయి.
 
  వెలుగోడు మండలంలోని వెలుగోడు, అబ్దులాపురం, మాధవరం, వేల్పనూరు గ్రామపంచాయతీ కార్యాలయాలు పాతభవనంలోనే కొనసాగుతున్నాయి. రేగడగూడూరు, బోయరేవుల, మోత్కూరు  గ్రామపంచాయతీ కార్యాలయాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి.
 
  బండి ఆత్మకూరు మండలంలో ఏ కోడూరు, పరమటూరు, ఈర్నపాడు, కడుమలకాల్వ తదితర గ్రామాల్లో పంచాయతీ భవనాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నెలకు రూ. 1000 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు.
 
  బేతంచెర్ల మండలంలోని హెచ్ కొట్టాలలో భవన నిర్మాణం జరుగుతుండగా, ముద్దవరం గ్రామంలో స్థల పరిశీలనలో ఆగిపోయింది. మేజర్ గ్రామపంచాయతీలైన బేతంచెర్ల, సిమెంట్‌నగర్, సాధారణ పంచాయతీ బుగ్గానిపల్లె ,గోర్లగుట్ట మినహా మిగతా వాటికి నేటి వరకు విద్యుత్ సౌకర్యం లేదు.
 
  కోడుమూరు మండలంలో  9, గూడూరులో 6, సి.బెళగల్‌లో 5, కర్నూలు మండలంలో 21 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల్లో నేటికి 9 భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. 32 భవన నిర్మాణాలు పూర్తైప్పటికీ ప్రహరీ  నిర్మించలేదు.
 
  కోవెలకుంట్ల మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో కోవెలకుంట్ల, గుంజలపాడు గ్రామంలో మాత్రమే సచివాలయాలు ఉన్నాయి. మిగిలిన 15 గ్రామ పంచాయతీల్లోని పెద్దకొప్పెర్ల, భీమునిపాడు, కంపమల్ల, పొట్టిపాడు గ్రామాల్లో భవనాలు పూర్తి అయినా అరకొర వసతుల మధ్య ప్రభుత్వ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
 
  సంజామల మండలంలోని సంజామల, ఆల్వకొండ గ్రామాల్లో నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో గ్రామ పాలన చావిళ్లు, సత్రాలు, పాడుబడిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. పేరుసోమలలో సొంతభవనం లేక పాడుబడిన పశువైద్యశాలలో సచివాలయ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
 
  మంత్రాలయం మండలంలోని రచ్చుమర్రి, పరామాన్‌దొడ్డి తండా, చిలకల డోణా గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేవు. సూగూరులో పంచాయతీ భవనం పూర్తయినా తలుపులు తెరచుకోలేదు.
 
  కోసిగి మండలంలోని జంపాపురం, బెళగల్ , బొంపల్లి, కామన్‌దొడ్డి గ్రామాల్లో భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జుమ్మలదిన్నె గ్రామంలో పంచాయతీ కార్యలయాన్ని నిర్మించలేదు.
 

మరిన్ని వార్తలు