అంతా పక్కా స్కెచ్‌

9 Jun, 2017 08:37 IST|Sakshi
అంతా పక్కా స్కెచ్‌

సాక్షి, అమరావతి: అధికార పార్టీ పెద్దలు, కీలక నేతలు పకడ్బందీ స్కెచ్‌తోనే ప్రభుత్వ భూములను కొట్టేశారని స్పష్టమవుతోంది. రికార్డులను మాయం చేసి ట్యాంపరింగ్‌ చేసి విలువైన ప్రభుత్వ భూములను సొంతం చేసుకునేందుకు సుదీర్ఘ కాలం కిందటే ప్లాన్‌ చేసుకున్నారు. నిషేధిత ఆస్తుల (క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయకూడని) జాబితా (పీఓబీ) వివరాలను 2016 మార్చిలోగా సమర్పించాలని హైకోర్టు 2015 డిసెంబరులో ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కడం వెనుక ఆంతర్యం ఇదే. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2016 మార్చిలో పీఓబీ జాబితాను రిజిస్ట్రేషన్‌ అధికారులు వెబ్‌సైట్‌లో పెడితే తర్వాత వాటిని రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉండదు.

ప్రభుత్వ భూములను కైవశం చేసుకునే ఆస్కారం ఉండదు. అందువల్లే 2016లో పీఓబీ జాబితాను రిజిస్ట్రేషన్‌ అధికారులకు ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని అధికార పక్ష నేతలు కట్టడి చేశారు. విలువైన స్థలాలు/ భూములపై కన్నేసి రికార్డులు తారుమారు చేశారు. బినామీ పేర్లతో కైవసం చేసుకునే వరకూ ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్స్, గ్రామ మ్యాపులు, ఇతర రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయనే విషయం ప్రభుత్వానికి 2016 జూలైలోనే తెలుసు.

భూ రికార్డుల డిజిటలైజేషన్‌ సందర్భంగా రికార్డులు కనిపించని విషయాన్ని క్షేత్ర స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఇది గత ఏడాది చివర్లోకలెక్టర్ల కాన్ఫరెన్సులో కూడా ప్రస్తావనకు వచ్చింది. అయినా ప్రభుత్వం దీనిపై  విచారణకు ఆదేశించకుండా ఉండడాన్ని బట్టే కీలక నేతలు ఉద్దేశపూర్వకంగానే దీనిని దాచి ఉంచారని, ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టుకున్న తర్వాత ఏమీ ఎరుగనట్లు విచారణ పేరుతో నాటకం ఆడుతున్నారని తేటతెల్లమవుతోంది.

మరిన్ని వార్తలు