అక్రమదందా!

11 Feb, 2016 23:28 IST|Sakshi

ఇద్దరు అధికార పార్టీ
ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్న అక్రమ ఇసుక
ఆరు నెలల్లో  రూ.25 కోట్ల అక్రమార్జన
అక్రమ రీచ్‌ల కోసం ఆధిపత్య పోరు

 
కొన్నదానికంటే కొట్టుకొచ్చిన జాంపండుకు రుచి ఎక్కువ అంటారు... అదెంత నిజమో తెలీదు కాని జిల్లాలో అక్రమంగా తవ్వుకొచ్చిన ఇసుకకు మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది ఏకంగా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ తవ్వకాల కోసం సిగపట్లు పట్టుకునేంతవరకు వెళ్లింది. వరహా నదిలో  తామే  అక్రమంగా తవ్వుకుంటామంటే... కాదు కాదు మేమే తవ్వుకుంటామంటూ వివాదానికి దిగుతున్నారు. ఎందుకంటే ఆ అక్రమార్జన విలువ నెలకు రూ.4 కోట్ల పైమాటే మరి.
 
విశాఖపట్నం : యలమంచిలి, ఎస్.రాయవరం సరిహద్దుల్లోని వరహా నది ఇసుక జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కాసుల పంట పండిస్తుండటంతో పాటు వారిద్దరి మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. అధికారికంగా జిల్లాలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయలేదు. కానీ యలమంచిలి, ఎస్.రాయవరం  మండలాల సరిహద్దుల్లో గార్లపూడి, రామచంద్రాపురం, గొట్టివాడ సమీపం   తదితర చోట్ల   అధికార టీడీపీ నేతలు అక్రమ ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు.  యలమంచిలి నియోజకవర్గానకి చెందిన ప్రజాప్రతినిధి పార్టీ మండల స్థాయి నేతకు బాధ్యతలు అప్పగించి జేసీబీలతో అక్రమంగా ఇసుక తవ్వకాల దందాకు తెరతీశారు. దాంతో ఈ రీచ్‌లపై పాయకారావుపేట నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను పడింది. తమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఇసుకను యలమంచిలి నియోజకవర్గ నేతలు తవ్వుకుపోవడమేమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రజాప్రతినిధి  ఎస్.రాయవరం మండల ప్రజాప్రతినిధిని ఇన్‌చార్జిగా పెట్టి జేసీబీలతో అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. ఈ వ్యవహారం అంతా రాత్రి పూట జరుగుతోంది. చీకటిపడిన తరువాత భారీ సంఖ్యలో వాహనాలతో ఇసుకను తవ్వుకుపోతున్నారు.

ఆరు నెలల్లో రూ.25 కోట్లు కొల్లగొట్టారు
రెండు నియోజకవర్గాల నేతలు ఆరునెలలుగా ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు జరిపేస్తున్నారు. రెవెన్యూ వర్గాల అంచనా ప్రకారం రోజుకు దాదాపు 50 లారీలు, 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. లారీ ఇసుక లోడ్‌ను  రూ.20 వేలు, ట్రాక్టరు ఇసుక లోడ్‌ను రూ.4వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ ప్రకారం రోజుకు రూ.14 లక్షల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే నెలకు రూ.4.20 కోట్ల చొప్పున  గత ఆరు నెలలుగా రూ.25 కోట్ల వరకు భారీ దోపిడీకి పాల్పడ్డారని తెలిసింది.  ముందుముందు ఈ అక్రమ ఇసుక దందాతో ఇంకెంతగా అక్రమార్జనకు పాల్పడతారన్నది ఊహింప శక్యం కాకుండా ఉంది.

ఇసుకపై ఆధిపత్యం కోసం విభేదాలు
ఇసుక అక్రమార్జన పూర్తిగా తమకే చెందాలని ఎవెరికి వారు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. అందుకే ఒకరివర్గంపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీరిద్దరి ఒత్తిడితో పోలీసులు కొన్ని కేసులు నమోదు చేశారు.  ఈ వ్యవహారంపై ఇద్దరికీ సన్నిహితుడైన జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలిసింది. ఇసుక ఆదాయం అంతా తనకు చెందాలంటే కాదు తనకే చెందాలని ఇద్దరూ వాగ్వాదానికి దిగారు.  పాయకారావుపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కీలక నేత సహకారాన్ని కూడా కోరినట్లు తెలిసింది. ఆయన ద్వారా ఈ వివాదం తనకు అనుకూలంగా పరిష్కరించుకోవాలన్నది ఎత్తుగడ వేశారు. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల అక్రమ ఇసుక దందా వివాదం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
 

మరిన్ని వార్తలు