20 ఏళ్లు...ఒకే పోస్టు

17 Nov, 2014 01:54 IST|Sakshi
20 ఏళ్లు...ఒకే పోస్టు

పదోన్నతులకు దూరంగా జీజీహెచ్ వైద్యులు
 
 సాక్షి, గుంటూరు: నిత్యం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)కి వచ్చే పేద రోగుల అనారోగ్య బాధలు తీర్చే వైద్యులు పదోన్నతులకు దూరమయ్యారు.  ప్రతిభ, సీనియార్టీ ఉన్నా పట్టించుకునే వారు లేక ఇరవై ఏళ్లుగా అదే పోస్టుల్లో కొనసాగుతూ అసంతృప్తికి గురువుతున్నారు. మూడు, నాలుగేళ్లకోసారి అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు కల్పిస్తున్నా ఇక్కడ ఆ ఊసే ఎత్తడం లేదని నిరాశకు లోనవుతున్నారు.

     {పభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనేక విభాగాల వైద్యులు ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగుతున్నారు.

     ఎంత సీనియారిటీ ఉన్నా పదోన్నతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లకొకసారి పదోన్నతులు ఇవ్వాల్సి ఉన్నా ఇరవై ఏళ్లు దాటినా పట్టించుకోకుండా అదే పోస్టుల్లో కొనసాగిస్తున్నారని అనేక మంది వైద్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 ఖాళీలు ఉన్నా భర్తీ చేయరెందుకు...
     గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 32 వైద్య విభాగాలు ఉన్నాయి. వీటిలో 65 ప్రొఫెసర్ పోస్టులకు 44 మంది మాత్రమే ఉన్నారు. 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

     46 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 32 మంది మాత్రమే ఉన్నారు. 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
     195 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 160 మంది ఉన్నారు. 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

     వైద్య కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నా తగినంత మంది అధ్యాపక సిబ్బంది లేరు. దీనివల్ల వైద్య విద్యార్థులకు సరైన విద్యాబోధన జరగడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.

     జీజీహెచ్‌లో రోగుల సంఖ్య పెరిగి వైద్యులు తీవ్ర పని ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. కొత్త పోస్టుల మాట అటుంచి కనీసం ఇక్కడ పనిచేస్తున్న వైద్యులకైనా పదోన్నతులు కల్పిస్తే అసిస్టెంట్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

     అనేక ఏళ్లుగా  వైద్య విద్య డెరైక్టర్ (డీఎంఈ) మాత్రం ఈ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం శోచనీయమని వైద్యాధికారులు మండిపడుతున్నారు.

 మాకు ఉత్తుత్తి పదోన్నతులా...
     ఐదేళ్లకొకసారి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా దాన్ని పక్కనబెట్టి వైద్య కళాశాల, జీజీహెచ్‌ని తనిఖీ చేసేందుకు భారత వైద్య మండలి(ఎంసీఐ) సభ్యులు వచ్చినప్పుడు మాత్రం తమకు పదోన్నతులు కల్పించినట్లుగా సృష్టించి పబ్బం గడుపుతున్నారని పలువురు వైద్యులు వాపోతున్నారు. ఎంసీఐ బృందం వెళ్లగానే తిరిగి తమను ఎప్పటిలానే పాత పోస్టుల్లో కొనసాగిస్తున్నారని, ఇలా అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     అర్హత ఉన్నా పదోన్నతులు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తమతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో చేరిన వైద్యులు ఇప్పుడు ప్రొఫెసర్‌లుగా పనిచేస్తుంటే తాము మాత్రం ఇరవైఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగానే కొనసాగుతున్నట్టు తెలిపారు.
     పదోన్నతుల గురించి పట్టించుకోకుండా డీఎంఈ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని  తీవ్ర అసహనం వెలిబుచ్చుతున్నారు.

     తామంతా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పదోన్నతులపై పోరాడేందుకు మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు వైద్యుల సంఘం నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో తమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించు కుంటామన్నారు.

మరిన్ని వార్తలు