రెండో పెళ్లికి యత్నం

18 Aug, 2013 03:53 IST|Sakshi
కడప అగ్రిక ల్చర్, న్యూస్‌లైన్: రెండో పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. మార్కాపురానికి చెందిన వెంకటశివ కడపకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అంతకు ముందే అతనికి విజయలక్ష్మితో వివాహమైంది. ఈ విషయం భార్యకి తెలియకుండా మరో వివాహం చేసుకునేందుకు నిశ్చితార్థానికై కడపకు వచ్చాడు. పసిగట్టిన ఆమె ఎదురు తిరగడంతో నిశ్చితార్థపు తంతు ఆగిపోయింది. చిన్నచౌకు పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వెంకటశివ, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన విజయలక్ష్మి హైదరాబాద్‌లో ఒకరు కంపెనీలో, మరొకరు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరికి పరిచయాలు ఏర్పడి ప్రేమించుకున్నారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో వారిద్దరు కలిసి వివాహం చేసుకున్నారు.
 
 అటు తర్వాత శాస్త్రోక్తంగా తిరుపతికి వెళ్లి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో సాఫీగా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో వెంకటశివ ‘మా చెల్లెలు నిశ్చితార్థం ఉంది, కడపకు వెళ్లాలి’ అని భార్య విజయలక్ష్మికి చెప్పాడు. దీంతో తాను కూడా వస్తానని మొండికేసింది. చేసేదేమీలేక వెంకటశివ భార్యను వెంట పెట్టుకుని వచ్చాడు. నిశ్చితార్థం తన చెల్లెలుకు జరుగుతుందని మాయ మాటలు చెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే నిశ్చితార్థం సందర్భంగా అబ్బాయి వెంకటశివను అక్కడికి పిలవడంతో ఇదేమిటి చెల్లెలు నిశ్చితార్థం అన్నావు.. నీవు నిశ్చితార్థం చేసుకుంటున్నావని విజయలక్ష్మి ఎదురు తిరిగింది. ఈ విషయం రెండో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి తండ్రితో చెప్పింది. అయితే నీతో వెంకటశివకు వివాహం జరిగినట్లు ఆధారమేమిటని అక్కడ ఉన్న వారందరూ ప్రశ్నించారు.
 
 ఇదిగో తాళి అని చూపించింది. ఇది కాదు ఫొటోలు, సంబంధిత పత్రాలు ఏవైనా ఉంటే బాగుంటుందని అన్నారు. విజయలక్ష్మి చేసేదేమీలేక చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు రంగప్రవేశం చేసి వెంకటశివను కొత్తగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తాలూకు మనుషులను పిలిపించి మాట్లాడారు. వెంకటశివ తన భర్త అని ఆధారాలున్నాయని, అవి హైదరాబాద్‌లో ఉన్నాయని విజయలక్ష్మి చెప్పింది. పోలీసులు హైదరాబాద్‌లో మీరు నివాసముంటున్న ఏరియా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఉచిత సలహా ఇచ్చి పంపినట్లు విజయల క్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో నిశ్చితార్థం ఆగిపోయింది. 
 
మరిన్ని వార్తలు