అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందే

6 Sep, 2014 03:12 IST|Sakshi
అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందే

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో కుంగిన అష్టోత్తరలింగ మండపాన్ని తొలగించాల్సిందేనని ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ), చెన్నై రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహారావు సూచించారు. ఆరు రోజుల క్రితం శ్రీకాళహస్తి ఆలయంలోని కంచుగడప సమీపంలో ఉన్న అష్టోత్తరలింగ మండపం కుంగిన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించడానికి చెన్నైకి చెందిన ఐఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్, గోపురాల ఎక్స్‌పర్ట్స్ కమిటీ సభ్యుడు నరసింహారావును ఆలయ అధికారులు పిలిపించారు.  

మరో నిపుణుడు జీఎస్ రెడ్డితో కలసి ఆయన అష్టోత్తరలింగ మండపాన్ని, ఆలయంలోని నాలుగు గోపురాలను, చిన్న చిన్న మండపాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ అష్ఠోత్తరలింగ మండపాన్ని మరమ్మతులు చేస్తే సరిపోదు. పూర్తిగా తొలగించి నూతన మండపాన్ని నిర్మించాల్సిందే. మండప బీమ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఏక్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మండప బీమ్‌కు ఆధారంగా చెక్కలు ఒక్కచోట పెడితే సరిపోదు. పదిచోట్ల చెక్కలు ఏర్పాటు చేయాలి.

ఈ మార్గంలో భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేయండి. ఆలయంపైన పిచ్చిమొక్కలు, కొబ్బరి చిప్పలు నూనె డబ్బాలు ఉంచవద్దు అని సూచించారు.  దీంతో ఇంజనీరింగ్ అధికారులు మండపం మొత్తం బీమ్‌కు ఆధారంగా చెక్కలను పెట్టారు. ఆమేరకు నూతన మండపం నిర్మాణానికి ఆలయ  ఈఈ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మండపం తొలగింపునకు రూ.1.5 లక్షలు, నూతన మండప నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
 

మరిన్ని వార్తలు