బదిలీల వేళ

23 Jan, 2014 03:47 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: జిల్లాలో అధికారుల బదిలీల వాతావరణం వేడెక్కింది. దీర్ఘకాలి కంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న క్రమంలో సీట్లలో పాతుకపోయిన, స్థానిక అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధముండే ఆయా శాఖ లకు బదిలీల సెగ తాకింది. మూడేళ్లకు పైబడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికార యంత్రాంగాన్ని కదలించేందుకు కసరత్తు జరుగుతోంది.సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్, ఎంపీడీఓలకూ స్థానచలనం ఉండేలా జాబితా రూపుదిద్దుకుంటోంది. ఈ బాధ్యతలను ఆయా ఆర్డీఓలకు జిల్లా యంత్రాంగం అప్పజెప్పింది.
 
 అలాగే పోలీసు శాఖలో సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు)లు, ఎస్‌ఐ (సబ్ ఇన్‌స్పెక్టర్ల)ల జాబితా తయారు చేస్తున్నారు. ఈ జాబితాలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ ఆమోదముద్ర పడడ మే తరువాయి బదిలీలు జరుగుతాయి. అయితే ఓటర్ల తుది జాబితా వెలువడే వరకు బదిలీలకు అవకాశం లేదు. ఈ మేరకు నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈనెలాఖరులోగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా బదిలీ ప్రక్రియ వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. బదిలీ అయిన అధికారులు ఫిబ్రవరి 11వ తే దీన కొత్తస్థానాల్లో ఆసీనులవుతారు.
 
 ఎంపీడీఓలకూ..?
 ఎన్నికల వేళ అధికారులు సొంత జిల్లాలో పనిచేస్తే పక్షపాతంగా వ్యవహరిస్తారన్న ఉద్దేశంతో ప్రతి రెవెన్యూ, పోలీస్ అధికారులను ఈసీ బదిలీ చేస్తుంది. ఈసారీ అందుకు తగ్గట్టుగానే రంగం సిద్ధమవుతోంది. త్వర లో సాధారణ ఎన్నికలు జరగనుండడంతో ఈ ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి బదిలీల జాబితాలోకి ఎంపీడీఓలు చేరే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు అధికారుల సంఖ్య సరిపోరని భావిస్తే ఇతర అధికారుల అవసరం ఏర్పడనుంది. అప్పుడు ఎంపీడీఓలకు బదిలీ తప్పదు.
 
 వీరికీ స్థానచలనం...
 జిల్లాలో 18 మంది డిప్యూటీ, స్పెషల్ డి ప్యూటీ కలెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఐదుగురికి స్థానచలనం లభించనున్నట్లు సమచారం. భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మధుకర్‌రెడ్డి, సీతారామరాజు, శేఖర్‌రెడ్డి జిల్లాకు చెందిన వారే. ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీ నాటికి కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదరావు జిల్లాలో విధులు నిర్వహించడం మూడేళ్లు పూర్తవుతుంది. ఈయనా బదిలీ కావొచ్చు. జిల్లాలో మూడేళ్లకు పైబడి పనిచేసిన తహసీల్దార్ల సంఖ్య బాగానే ఉంది.
 
 వీరికి తోడు ఇదే జిల్లాకు చెందిన వారు స్థానికంగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. ఇలా దాదాపు 40మంది వరకు తహసీల్దార్లు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీడీఓల అవసరం ఏర్పడితే.. ఇంచుమించుగా వారుఉ కూడా అంతే సంఖ్యలో బదిలీ అవుతారు. మరోవైపు పోలీస్ శాఖలోనూ పెద్దఎత్తున బదిలీలు జరగనున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలు, సీఐలకు స్థానచలనం తథ్యం. మొత్తం మీద పోలీసుశాఖలో 40 మందికిపైగానే బదిలీ కానున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు