అత్యవసరమైతే నరకమే!

28 Apr, 2017 13:02 IST|Sakshi
అత్యవసరమైతే నరకమే!

► క్యాజువాలిటీలో కుట్టు వేసే కిట్లకు కొరత
► ఏఎంసీలో పడకల కొరత
► అందుబాటులో లేని స్ట్రెచ్చర్లు, వీల్‌చైర్లు
► వార్డుబాయ్‌ల సంఖ్య అంతంతే..
► స్పందించని అధికారులు

ఏదైనా ప్రమాదంలో, దాడిలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అత్యవసర చికిత్సకు వెళ్లారా? అయితే మీలో సహనం కాస్త ఎక్కువగా ఉండాల్సిందే. ఎందుకంటే.. మరో నలుగురైదుగురు అక్కడ అప్పటికే చికిత్స పొందుతుంటే మీరు వేచి ఉండకతప్పదు. కారణం.. అత్యవసరంగా కుట్లు వేయాల్సిన కిట్లు అవసరమైనన్ని లేవు మరి. దీనికి తోడు పడకల కొరతతో రోగులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది.

కర్నూలు(హాస్పిటల్‌): ఆసుపత్రిలోని క్యాజువాలిటీకి ప్రతిరోజూ అత్యవసర చికిత్స కోసం 100 నుంచి 150 మంది దాకా వస్తుంటారు. వీరికి అక్కడ ఉండే క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు డ్యూటీ డాక్టర్లైన ఫిజీషియన్లు, సర్జన్లు, ఆర్థోపెడిస్ట్, ఇదే విభాగాల నుంచి పీజీలు, హౌస్‌ సర్జన్లు సేవలందించాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది అత్యవసర చికిత్స నిమిత్తం వస్తే వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తూ వస్తారు.

కొన్నిసార్లు రక్తగాయాలైన వారు అధిక సంఖ్యలో వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. గాయాలకు కుట్లు వేసే కిట్లు(సూటు ప్యాక్స్‌) లేదా 10, 20, 30 ప్రోలైన్లు కొరత ఉండటంతో రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిని కొనుగోలు చేయాలని ఆసుపత్రి సిబ్బంది పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరువైంది. ఒక్కో కిట్టు ధర రూ.500లకు మించదు.

ఆసుపత్రిలో అత్యవసరం కాని పరికరాలకు లక్షల రూపాయలు వెచ్చిస్తుండగా.. రోగులకు అత్యవసర చికిత్సనందించే ఇలాంటి కిట్లకు మాత్రం నిధుల కొరతను సాకుగా చూపడం విమర్శలకు తావిస్తోంది. దీనికితోడు క్యాజువాలిటీలోని ఎమర్జెన్సీ ఓపీలో ఏసీ, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో అటు చికిత్స అందించే వైద్యులు, రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.

ఏఎంసీలో బెడ్ల కొరతతో పడిగాపులు
అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులకు ముందుగా క్యాజువాలిటీలో ప్రాథమిక వైద్యం అందిస్తారు. అనంతరం వీలును బట్టి రోగులను అక్యూట్‌ మెడికల్‌ కేర్‌(ఏఎంసీ)లో చేరుస్తారు. ఏఎంసీలో 40 పడకలు ఉన్నాయి. అయితే నిత్యం ఈ పడకలు రోగులతో నిండి ఉంటాయి. క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స నిమిత్తం వచ్చిన రోగిని ఏఎంసీలో చేర్చాలంటే అక్కడున్న రోగులను సాధారణ వార్డులకు తరలించాల్సి ఉంటుంది.

ఒక్కోసారి రోగులందరూ ఏఎంసీలో ఉండాల్సిన పరిస్థితి నెలకొన్న సమయంలో ఎవరిని సాధారణ వార్డుకు తరలించాలో వైద్యులకు అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ధైర్యం చేసి కాస్త బాగైన రోగులను సాధారణ వార్డుకు తరలించి పడకలు ఖాళీ చేసి, క్యాజువాలిటీ రోగుల కోసం ఉంచుతున్నారు. ఏఎంసీలో బెడ్లు ఖాళీగా మారేంత వరకు క్యాజువాలిటీలోనే అవసరమైన చికిత్స అందక రోగులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది.

ఏఎంసీకి ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో ఇప్పటికీ ఇది అనధికారికంగానే కొనసాగుతోంది. గుర్తింపు లేకపోవడంతో మెడికల్‌ విభాగాల నుంచి వైద్యులు రెఫరల్‌ పద్ధతిలో ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎమెర్జెన్సీ మెడిసిన్‌ విభాగం మంజూరైతే గానీ రోగులకు ఇబ్బందులు తీరని పరిస్థితి నెలకొంది.

స్ట్రెచ్చర్లు, బాయ్స్‌ కొరత
క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స కోసం వచ్చి వార్డు బాయ్‌ వస్తాడు, స్ట్రెచ్చర్‌ తెస్తాడని ఎదురుచూస్తే రోగి ప్రాణం బయటే పోయినట్లే. అందుకే చాలా మంది క్యాజువాలిటీకి వెళ్లాలంటే రోగులను నడిపించుకుంటూనో.. లేదా చేతులపై, భుజాలపై మోసుకుని వెళ్తుంటారు. క్యాజువాలిటీ నుంచి ఇతర వార్డులకు, వైద్యపరీక్షలకు వెళ్లాలన్నా స్ట్రెచ్చర్లు, వీల్‌చైర్ల కొరత తీవ్రంగా ఉంది.

ఈ కారణంగా గంటల తరబడి రోగులు స్ట్రెచ్చర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వార్డుబాయ్స్‌ కొరత కూడా ఉండటంతో శానిటేషన్‌ వర్కర్లు రోగులను పరీక్షలకు, వార్డులకు తరలిస్తూ కనిపించడం ఇక్కడ పరిపాటిగా మారింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు