సత్తెనపల్లిలో ‘సిమ్’ల రాకెట్

30 Aug, 2015 02:28 IST|Sakshi

తప్పుడు చిరునామాలతో సిమ్ కార్డులు విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లు
 
 సత్తెనపల్లి :  తప్పుడు చిరునామాతో సత్తెనపల్లిలో సిమ్ కార్డులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టణంలో విజయ్ అనే ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఐదుగురు సబ్ డిస్ట్రిబ్యూటర్లు సిమ్‌లను తీసుకొచ్చి తప్పుడు చిరునామాలతో అమ్మకాలు చేపడుతున్నారు. ఓ డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి అర్బన్ సీఐ ఎస్.సాంబశివరావు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రత్యేకంగా ఓ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఓటర్, ఆధార్, రేషన్ కార్డుల్లోని ఫొటోలను మార్చేసి, అదే చిరునామాలతో సిమ్‌లను విక్రయిస్తున్నారు.

ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక్కొక్కరు 350 సిమ్‌లు తీసుకుని విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. వీటిలో మొత్తం సిమ్‌లను విక్రయిస్తే ఒక్కో సిమ్‌కు రూ.10 చొప్పున, 350 సిమ్‌లకు రూ.3,500 కమీషన్ రూపేణా వస్తుంది. సబ్ డిస్ట్రిబ్యూటర్ కేవలం 349 సిమ్‌లు మాత్రమే విక్రయాలు జరిపితే అన్ని సిమ్‌లకు కమిషన్ నిలిచి పోతుంది. దీంతో వినియోగదారులు కొనుగోలు చేయగా మిగిలిన సిమ్‌లను తప్పుడు అడ్రస్సులతో యాక్టివేట్ చేసి విక్రయాలు జరిపినట్లు చూపుతున్నారు. చిరునామా లేని సిమ్‌లను విద్యార్థులు, యువకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ప్రధానంగా పట్టణంలో ప్రధాన డిస్ట్రిబ్యూటర్ పరిధిలోని ఐదుగురు సబ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేకంగా ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడ ఈ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లతో పాటు వారి నుంచి 4,300 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని, పూర్తి స్థాయిలో వారి నుంచి యంత్రాలు, సిమ్ కార్డులు స్వాధీనపరుచుకోవాల్సి ఉందని సీఐ సాంబశివరావు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు పోలీసుల అదుపులో ఉండటంతో రిటైల్ వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎవరిని ఎప్పుడు పోలీసులు రమ్మంటారోనని భయాందోళన చెందుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ రాకెట్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి వారి అక్రమ విక్రయాలకు ఫుల్‌స్టాప్ పెడతామని సీఐ చెప్పారు.

మరిన్ని వార్తలు