సిబ్బంది నిర్లక్ష్యంతోనే బిడ్డ మాయం

22 Jan, 2015 02:15 IST|Sakshi
సిబ్బంది నిర్లక్ష్యంతోనే బిడ్డ మాయం

డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి డిమాండ్

 
 తిరుపతి క్రైం: చంద్రగిరి మండలం మొరవపల్లి గ్రామానికి చెందిన మునిరాజా భార్య సోనియా పురిట బిడ్డ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మాయమైందని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.ప్రసూతి ఆస్పత్రిలో ఉన్న సోనియా, ఆమె భర్తను బుధవారం ఎమ్మెల్యే పరామర్శించారు. మీకు ఆడపిల్ల పుట్టిందమ్మా, మీ మహాలక్ష్మి ఎక్కడికి పోదు.. మల్లీ మీ దగ్గరకు ఖచ్చితంగా చేరుకుంటుందని ఓదార్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేవలం ఆస్పత్రిలోని  డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే పాప మాయమైందన్నారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవా అని సిబ్బందిని ప్రశ్నించారు. ఆస్పత్రికి సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేశారు. పోలీసుల సొంతబిడ్డగా భావించి బాధ్యతగా వెతకాలన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా సిబ్బంది ఏమాత్రం చొరవ తీసుకోలేదన్నారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న  అలిపిరి ఎస్‌ఐ సురేష్‌కు కేసును చాలా వేగవంతంగా పురోగతి సాధించి బిడ్డను వారికి అప్పగించాలని సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ ఇంత నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
 
దోషులను కఠినంగా శిక్షించాలి


 తిరుపతి కార్పొరేషన్: ప్రసూతి ఆస్పత్రిలో పురిటిబిడ్డను మాయం చేసిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. బిడ్డను మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జై సమైక్యాంధ్ర పార్టీ, ఐద్వా, ఐకేపీ మహిళా సంఘాలు, టీడీపీ మహిళా విభాగం నాయకులు బుధవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పురిటి బిడ్డలను మాయం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ భవాని, ఆర్‌ఎంవో యశోదాబాయి బాధితులతో మాట్లాడారు.
 
 బిడ్డ ఆచూకీలో పురోగతి


 పురిటి బిడ్డ మాయం అయిన ఘటనలో పోలీసులు పురోగతి సాధిస్తున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు బిడ్డ ఖమ్మంలో ఉన్నట్టు ఫోన్‌కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ఫోన్ కాల్స్ సిగ్నల్స్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు సీఐ సురేంద్రనాయుడును వివరణ కోరగా మీడియా, పత్రికల్లో వస్తున్న కథనాలు చూసి పలు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, అవి ఫేక్ కాల్స్‌గా గుర్తించామన్నారు. అనుమానితులను విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు