43వ ప్రయోగం సక్సెస్

1 Jul, 2014 03:37 IST|Sakshi
43వ ప్రయోగం సక్సెస్

- ఇస్రో విజయపరంపర
- భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు సన్నాహాలు

సూళ్లూరుపేట: అరుదైన విజయాలతో వినీలాకాశంలో త్రివర్ణ పతాకాన్ని ఇస్రో రెపరెపలాడిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ23 సక్సెస్‌తో 43వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్రో తన ఐదు దశాబ్దాల ప్రస్థానంలో షార్ నుంచి చేపట్టిన 43 ప్రయోగాలతో 71 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. ఈ విజయాల వెనుక ఎందరో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఉంది. వీరిలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్‌ధవన్ కృషి కీలకమైనది.

శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం రావడానికి విక్రమ్ సారాభాయ్ బీజం వేస్తే, దీనిని అభివృద్ధి చేయడంలో సతీష్ ధవన్ కీలకపాత్ర పోషించారు. 1962 నుంచి 1978 వరకు సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసుకుంటున్న ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా నుంచి 1975 మే 19న ప్రయోగించింది. 1979 జూన్ 7న భాస్కర్-1 అనే ఉపగ్రహాన్ని కూడా రష్యానుంచే ప్రయోగించింది.

ఈ లోపు శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో 1979 ఆగస్టు 10న ఎస్‌ఎల్‌వీ-3 ఇ1 పేరుతో ఒక మోస్తరు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. ఈ అపజయంతో కుంగిపోకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు మన శాస్త్రవేత్తలు. 1980 జూలై 18న ఎస్‌ఎల్‌వీ-3 ఇ2 పేరుతో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో నూతనోత్సాహంతో ముందుకు సాగారు. అక్కడినుంచి ఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో నాలుగు ప్రయోగాలు చేసి మూడింటిని విజయవంతం చేశారు. 1987 మార్చి 24 ఏఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సిరీస్ లో నాలుగు ప్రయోగాలు చేసి రెండు విజ యం సాధించగా, రెండు ఫెయిల య్యాయి. ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ రాకెట్లలో చిన్న తరహా  ఉపగ్రహాలను పంపారు. 1993 సెప్టెంబర్ 20న పీఎస్‌ఎల్‌వీ లాంటి భారీరాకెట్ ప్రయోగాలకు నడుం బిగించారు. ఇందులో ఇప్పటిదాకా 27 ప్రయోగాలు చేయగా మొదట చేసిన ప్రయోగం తప్ప మిగిలినవన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకేసి జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను చేపట్టారు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఎనిమిది ప్రయోగాలు చేయగా మూడు విఫలమయ్యాయి.

షార్ నుంచి ఇప్పటివరకు మొత్తం 43 ప్రయోగాలు చేయగా ఏడు తప్ప మిగిలినవన్నీ విజయవంతమై అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో భారత్‌ను ఐదో స్థానంలో నిలిపాయి. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో కీలకమైన క్రయోజనిక్ దశను రష్యా సాంకేతిక సహకారం తీసుకుని ప్రయోగించేవారు. ఈ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకునే ప్రయత్నంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి, ఈ ఏడాది జనవరి 5న చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ డీ5 ప్రయోగ విజయంతో సాంకేతిక నైపుణ్యం సాధించి మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తులో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను వాప్యారాభివృద్దికి వాడుకుంటూ జీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ద్వారా భారీ సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు