‘స్పై’ కామాంధులు

28 Jun, 2015 02:40 IST|Sakshi

గుంతకల్లు టౌన్ : పాత గుంతకల్లుకు చెందిన రామకృష్ణారెడ్డి అనే యువకుడు బరితెగించి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. నెలన్నర క్రితం తన సమీప బంధువుల పెళ్లి వేడుకలకై అద్దెకు తీసుకున్న పరిటాల శ్రీరాములు కళ్యాణ మం డపం బాత్‌రూమ్‌లో నాలుగైదు స్పై కెమెరాలను ఓ పాతబట్టలో చుట్టి రహస్యంగా అమర్చాడు. ఆ గదిలో మహిళలు స్నానాలు చేసిన దృశ్యాలను క్యాప్చరింగ్ చేసి మెమోరీ కార్డుల్లోకి డౌన్‌లోడ్ చేసుకున్నాడు.

అయితే ఆ దృశ్యాలన్నింటినీ ఒక్కొక్కటి నిశితంగా పరిశీలించి తనకు గుర్తున్న వారి బంధువుల పేర్లు, వారు ఏయే డ్రస్స్‌లు ధరించారని ఓ చిన్న ప్యాకెట్ డైరీలో రాసుకున్నాడు.  తరువాత కాయిన్ బాక్స్‌ల నుంచి ఫోన్ చేసి వధువు కుటుంబసభ్యులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో నరకయాతను అనుభవించిన ఆ కుటుంబసభ్యులు పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందని భావించి పోలీసు ఉన్నతాధికారులకి తమ సమస్యను విన్నవించారు.

 పోలీసుల స్ట్రింగ్ ఆపరేషన్ సక్సెస్...
 ఆడవాళ్ల అందచందాలను స్పై కెమెరాల్లో చిత్రీకరించి ఆ వీడియోల ఆధారంగా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పక్కా ప్రణాళికతో వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తొలుత రామకృష్ణ రెడ్డి తనకు కొంత డబ్బివ్వాలని, ఆ మొత్తాన్ని బళ్లారి రోడ్‌లోని కి.మీను సూచించే ఫలానా మైల్‌స్టోన్ వద్ద నగదును ఉంచి వెళ్లమని వధువు తండ్రికి ఫోన్‌లో చెప్పాడు. తమను వేధిస్తున్న ఆ కీచకుడెవరో గుర్తిద్దామని కాపుకాచినా నిందితుడు అక్కడికి వెళ్లకుండా ట్రయల్ వేసినట్లు తెలిసింది. తిరిగి కథ మళ్లీ మొదటికి రావడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.

వధువు తండ్రికి వస్తున్న ఫోన్ నెంబర్లు, ఆ ఫోన్ ఏయే టవర్ లొకేషన్ నుంచి వస్తున్నాయో గమనించి నిఘా ఉంచారు. పోలీసుల ప్లాన్ ఫలించింది. నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని విచారించగా దిమ్మతిరిగే నిజాలన్నీ బయటపడ్డాయి. అతనివద్ద నుంచి నాలుగైదు స్పై కెమెరాలతో పాటు రెండు సిమ్, మెమోరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. కాగా నిందితుడిని చూశాక వధువు బంధువులు షాక్ గురైయ్యారు. సమీప బంధువని తెలిసి రగిలిపోయారు.
 
 నేడో..రేపో అరెస్ట్ చేసే అవకాశం?
 అదుపులోకి తీసుకున్న నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నిందితుడిపై నిర్భయ, ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబు తెలిపారు. నేడో, రేపో నిందితుడి అరెస్ట్ చూపే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు