ఓటు విజయం

8 May, 2014 01:28 IST|Sakshi
ఓటు విజయం
  •    68.43 శాతం పోలింగ్
  •    ఉత్సాహంగా పాల్గొన్న నవతరం ఓటర్లు
  •   యలమంచిలిలో అత్యధికం, పాడేరులో అత్యల్పం
  • ఓట్ల పండుగ వేళ..లక్షలాది ఓటర్లు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును  వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరవశింపజేశారు. బుధవారం ఉదయం 7గంటల నుంచే నగరంలో, జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో జనం బారులు తీరారు. వాతావరణం కూడా ఉల్లాసభరితంగా ఉండటంతో మధ్యాహ్నం వేళ కూడా పోలింగ్ చురుగ్గా సాగింది. 68.43 శాతంవరకూ ఓటింగ్ జరిగింది. కొత్తగా ఓట్లు వచ్చిన యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
     
    విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతం గా ముగిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం జిల్లాలో 68.43 శాతం వరకు ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. పోలింగ్ సమయం పెంచినా ఓటింగ్ శాతంలో వృద్ధి లేకపోవడం గమనార్హం. 2009 ఎన్నికల్లో జిల్లాలో 72.54 శాతం పోలింగ్  జరిగింది.

    ఈ సార్వత్రిక ఎన్నికల్లో 85 శాతం పోలింగ్ జరగాలని అధికారులు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వకలేకపోయాయి. గత ఎన్నికల్లో కంటే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా ఓటు హక్కు వినియోగించుకొనే విషయంలో మాత్రం ఆసక్తి చూపించలేదు. జిల్లాలో ఉన్న 3 లోక్‌సభ స్థానాలకు 41 మంది అభ్యర్థులు, 15 అసెంబ్లీ నియోజక వర్గాలకు 178 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 33,46,639 మంది ఓటర్లు ఉండగా సుమారుగా 68.43 శాతం మంది వరకు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి ఓటింగ్ వివరాలు గురువారానికి తెలుస్తాయని అధికారులు ప్రకటించారు.
     
    అరకు, పాడేరు నియోజక వర్గాలకు సంబంధించి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించగా.. మిగిలిన అన్ని నియోజక వర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు ఓటింగ్ జరిగింది. కొన్నిచోట్ల తెలుగుదేశం నా యకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించడం మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
     
    ఉదయం 6 నుంచే హడావుడి

    పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని తెలిసినా ఓటర్లు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎండ ఎక్కువగా ఉంటుందన్న భావనతో ఉదయమే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యమవడంతో వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో పోలింగ్ ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటల్లో జిల్లాలో 11.7 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది.

    ఈ సమయంలో గాజువాక, పాయకరావుపేటలలో 22 శాతం, యలమంచిలిలో 21, నర్సీపట్నం, భీమిలిలలో 16, అనకాపల్లిలో 15.67 శాతం పోలింగ్ నమోదైంది. తొలి రెండు గంటలు విశాఖ-తూర్పులో కేవలం 5 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య పోలింగ్ కాస్త పుంజుకుంది. తొలుత ఏ నియోజక వర్గాల్లో తక్కువ ఓటింగ్ జరిగిందో తరువాత రెండు గంటల్లో అక్కడ పోలింగ్ శాతం పెరిగింది.

    పాయకరావుపేట 38, నర్సీపట్నం 34.5, పెందుర్తి 34, యలమంచిలిలో 33, అనకాపల్లిలో 32, పాడేరులో 32.5, మాడుగులలో 31 విశాఖ-తూర్పులో 26 శాతం ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ వేగంగానే జరిగింది. అప్పటి వరకు 47.04 శాతం ఓటింగ్ ఉండగా, మధ్యాహ్నం 3 గంటల వరకు 56.40 శాతమే పోలింగ్ నమోదైంది. ఈ సమయంలో చాలా పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి.
     
    మొరాయించిన ఈవీఎంలు
     
    ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లు(ఈవీఎం)లు తలనొప్పిగా మారాయి. జిల్లాలో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లు మొరాయించాయి. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌కు ప్రారంభంలోనే ఈవీఎంలు ఇబ్బంది పెట్టగా మరికొన్ని చోట్ల మధ్యలో మొండికే శాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పోలింగ్ 20 నిమిషాల నుంచి 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.

    నాతయ్యపాలెం, పరవాడ, పెందుర్తి,  భీమిలిలో కుసులువాడలోనే కాకుండా నర్సీపట్నం, నాతవరం, మాడుగుల, దేవరాపల్లి, పాడేరు ఇలా అనేక మండలాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్‌కు గంట ఆలస్యమైంది. ముంచంగిపుట్టు మండలం మాకవరంలో ఈవీఎంలు పని చేయకపోవడంతో 3 గంటలు, అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో కొత్తూరులో, నాతవరం మండలంలో డి.యర్రవరం, ఎం.బి.పట్నం,వై.బి.పట్నం, చమ్మచింతలలో 2 గంటలు ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. చాలా కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో విసుగుచెంది కొంత మంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
     
    ఎండను సైతం లెక్కచేయకుండా
     
    జిల్లాలో ఓటర్లు ఎండను సైతం లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నా రు. భారీ క్యూలైన్లలో నిలబడి మరీ ఓటు వేశా రు. గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ పోలింగ్ కేంద్రాల్లో అధికారులు టెంట్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో నియమించిన వాలంటీర్లు సేవలను ఓటర్లు ప్రశంసించారు. క్యూలైన్ల నిర్వహణతో పాటు లైన్లలో ఉండే ఓటర్లకు మంచినీటి అందించేందుకు ఎన్‌ఎస్‌ఎస్, ఆశా కార్యకర్తలను నియమించారు.
     
    ఓట్లు గల్లంతు: చాలా చోట్ల ఓట్లు గల్లంతుపై ప్రజలు ఎన్నికల సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఓటరు స్లిప్పులు రాని వారు సైతం ఓటు వేసేందుకు ఓటరు కార్డుతో పోలింగ్ కేంద్రాలకు రాగా, ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
     
    పలకగిరి రీపోలింగ్: కొయ్యూరు మండలంలో పలకగిరి పోలింగ్ కేంద్రంపై సాయుధ మావోయిస్టులు విరుచుకుపడ్డారు. రెండు ఈవీఎంలను ఎత్తుకుపోయారు. సిబ్బంది వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ఇక్కడ పోలింగ్‌ను నిలిపివేశారు. ఈ కేంద్రం పరిధిలో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
     
    నివేదికను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌తో పాటు ఎన్నికల పరిశీలకులు ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకారం రీపోలింగ్ తేదీని ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు