ఈ-టెండర్లు విజయవంతం

11 Nov, 2014 03:43 IST|Sakshi
ఈ-టెండర్లు విజయవంతం

మొదటి రోజు 1440 బస్తాల వేరుశనగ విక్రయం
 

 ఆదోని:
 పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ-టెండర్ల ప్రక్రియ మొదటి రోజు సోమవాదం విజయవంతమైంది. 270 మంది రైతులు 1440 బస్తాలను ఈ-టెండర్లతో విక్రయించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు ఈనెల 6న యార్డులో ఈ-టెండర్లను లాంఛనంగా ప్రారంభించడం తెలిసిందే.

సోమవారం కొనుగోలుదారులు ఈ ప్రక్రియకు ససేమిరా అన్నప్పటికీ.. మార్కెటింగ్ శాఖ జేడీఏ రామాంజినేయులు, ఎంపిక శ్రేణి కార్యదర్శి రామారావులు నిరాకరించారు. వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా.. చాలా మంది గైర్హాజరయ్యారని, ఇప్పుడు పాత పద్ధతిలోనే మరికొన్ని రోజులు కొనుగోళ్లు చేపట్టాలని కోరడంలో అర్థం లేదన్నారు. యార్డు సిబ్బంది సహకారంతో టెండర్లు దాఖలు చేయాలని సూచించడంతో కొనుగోలుదారులు అంగీకరించారు.

సాయంత్రం 4 గంటల వరకు టెండర్లకు అవకాశం కల్పించగా.. ఆ తర్వాత 5 నిముషాల్లోనే అత్యధిక ధర కోట్ చేసిన వ్యాపారుల వివరాలను వెల్లడించారు. ప్రక్రియ సులభంగా ఉండటంతో పాటు త్వరగా పూర్తి కావడంతో వ్యాపారులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రక్రియనంతటినీ జేడీఏ రామాంజినేయులు దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి రోజు కావడంతో సాయంత్రం 4 గంటల వరకు సమయం ఇచ్చామని.. మంగళవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు టెండర్లు దాఖలు చేయాలన్నారు.

సాయంత్రం 5 గంటల్లోపు తూకాలను పూర్తి చేస్తే.. రైతులతో పాటు వ్యాపారులకూ సౌకర్యంగా ఉంటుందన్నారు. పది, పదిహేను రోజుల పాటు వేరుశనగకు మాత్రమే ఈ-టెండర్లు నిర్వహిస్తామని.. ఆ తర్వాత అన్ని దిగుబడులను ఇదే ప్రక్రియలో కొనుగోలు చేయాల్సి ఉంటుందని వ్యాపారులకు తెలిపారు.

మరిన్ని వార్తలు