ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం

15 Feb, 2014 00:15 IST|Sakshi

 గజ్వేల్/జగదేవ్‌పూర్, న్యూస్‌లైన్ :  ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా ‘ఇందిర జలప్రభ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ స్మితాసబర్వాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం గజ్వేల్ మండలం ఆహ్మాదీపూర్ గ్రామంలోని 10 మంది ‘ఇందిర జలప్రభ’ లబ్ధిదారులకు చెందిన 20 ఎకరాల్లో డ్రిప్ పథకాన్ని వర్తింప జేసిన పథకాన్ని ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో సూక్ష్మనీటి సేద్యపు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. కూరగాయలు, పండ్ల తోటల రైతులకు ఈ పథకంతో భారీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలో వచ్చే మార్చి కల్లా 60 వేల ఎకరాల్లో పరికరాలను బిగిస్తామని, ఇప్పటివరకు 5 వేల ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంలో సూక్ష్మ నీటి పథకం నిబంధనలు మార్చి స్పెసింగ్ పెంచడం, ప్రతి రైతుకు గ్రామసభ తీర్మానాన్ని కోరటం వంటి కొత్త నిబంధనల వల్ల ఎంతోమంది రైతులు దీనిపై ఆసక్తి చూపటం లేదని, ఫలితంగా లక్ష్యం నెరవేరడం లేదని ‘న్యూస్‌లైన్’ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. నిబంధనల విషయమై తామేమీ చేయలేమని వెల్లడించారు. నిబంధనలకు లోబడే రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తేల్చిచెప్పారు.

అనంతరం కలెక్టర్ ఆహ్మాదీపూర్ గ్రా మంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ రవీందర్, జిల్లా సూక్ష్మ నీటి పథకం ప్రాజెక్ట్ డెరైక్టర్ రామలక్ష్మి, ఉపాధిహామీ పథకం గజ్వేల్ నియోజకవర్గ ఏపీడీ వసంత సుగుణ, ఎంపీడీఓ కౌసల్యాదేవి, మండల సహకార సంఘం చైర్మన్ వెంకట్‌నర్సింహ్మారెడ్డి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

 అభివృద్ధి పనులకు కలెక్టర్ శంకుస్థాపన
 ఎస్సీ, ఎస్టీల భీడు భూములను సాగులోకి తీసుకవచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందించడమే ఇందిర జలప్రభ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం జగదేవ్‌పూర్ మండల తిమ్మాపూర్‌లో ఇందిర జలప్రభ బ్లాక్‌తో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్మితా సభర్వాల్ మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 5 వేల ఎకరాల్లో ఇందిర జలప్రభ పథకం ద్వారా బోరు మోటార్లు అందించి బిందు సేద్యం ద్వారా ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 9 మంది ఇందిర జలప్రభ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకాన్ని రైతులకు ఆధునాతన పద్ధతుల్లో అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పీర్ ఈఈ కనకరత్నం, డిప్యూటీ ఈఈ చంద్రమౌళి, ఆర్‌ఎంఎస్ ఎఈ అనిల్ కుమార్, ఎంపీడీఓ సలోమి ప్రియదర్శిని, పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ జనార్దన్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కొండ పోచమ్మ చైర్మన్ మల్లేశ ం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నవ్య, నాయకులు యాదగిరి, చల్లా బాలకిషన్, లకా్ష్మరెడ్డి, బంగా శ్రీనివాస్ రెడ్డి, బాలేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు